CBN Slams Jagan: అమరావతిని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దుదామునుకున్నా, జగన్ రాకతో అంతా అస్తవ్యస్తమైంది. రెండు తెలుగు రాష్ట్రాలకు టీడీపీనే చారిత్రక అవసరం.
File image of AP EX CM Chandrababu Naidu.

Amaravathi,  August 28: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) హైదరాబాద్ మరియు అమరావతిలపై మరోసారి తన గళం వినిపించారు. తాను ముందుచూపుతో వ్యవహరించి హైదరాబాదును ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పారు. అప్పుడు తాను చేసిన అభివృద్ధి కారణంగానే నేడు హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారిందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకున్నారు. నాడు ఎయిర్‌పోర్ట్‌కు అంత భూమి ఎందుకని నన్ను ఎగతాళి చేశారు. ఇప్పుడు అదే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ ప్రమాణాలు కలిగిన విమానాశ్రయంగా పేరుగాంచింది అని వెల్లడించారు. ప్రపంచంలోని కంపెనీలన్నీ హైదరాబాదుకు తెప్పించాను, దేశం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేశాను. తాను ఏది చేసినా సమాజం కోసమే, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొనే చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇన్ని మంచిపనులు చేయబట్టే ప్రజలు ఎన్టీఆర్‌ను తమ గుండెల్లో పెట్టుకున్నారని కాస్త సెంటిమెంట్ జోడించారు.

ఇక అపార అనుభవం ఉన్న తనకు రాష్ట్ర విభజన తర్వాత తనపై నమ్మకంతో ప్రజలు సీఎంగా గెలిపించారని చంద్రబాబు చెప్పారు.  నవ్యాంధ్రకు కూడా హైదరాబాద్ తరహాలో రాజధానిని తీర్చిదిద్దేందుకు అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించాము. కానీ, ఆ తర్వాత ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతి మనుగడనే ప్రశ్నార్థకం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ అంధకారమైపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ పాలనాపరంగా అన్నింటిలో విఫలమవుతున్నాడంటూ విమర్శలు చేశారు. జగన్ అమరావతిని దెబ్బతీయటంతో అందరూ తిరిగి హైదరాబాద్ వలస వెళ్లిపోతున్నారని  చెప్పారు.

ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ ఉండటం చారిత్రక అవసరం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను ఆశావాదిని, అధైర్యపడకుండా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీని మరింత పటిష్ట పరుస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.