Chandigarh, September 20: పంజాబ్ కొత్త ప్రభుత్వం సోమవారం కొలువుదీరింది. పంజాబ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ సోమవారం ప్రమాణస్వీకారం (Charanjit Singh Channi Sworn-In) చేశారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ చన్నీతో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పంజాబ్ కాంగ్రెస్ అధినేత సిద్ధూలు హాజరు కాగా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ గైర్హాజరు అయ్యారు.
కాగా పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. పంజాబ్‌లో దళిత వర్గానికి సీఎం పదవి దక్కడం ఇదే ప్రథమం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ 1972 ఏప్రిల్ 2న పంజాబ్‌లోని మక్రోనా కలాన్ గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అజ్మేర్ కౌర్, హర్సా సింగ్. దళితుల్లో రామదాసియా సిక్కు (చర్మకారులు) వర్గానికి చెందిన వారు. చన్నీ చాంకౌర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2015-16లె పంజాబ్ విధానసభలో విపక్షనేతగా ఉన్నారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణశాఖ బాధ్యతలు నిర్వహించారు.
కాంగ్రెస్ నేతలు సుఖ్ జిందర్ సింగ్ రంధ్వా, ఓపీ సోనీలు (Sukhjinder Singh Randhawa, OP Soni) పంజాబ్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంలలో ఒకరు జాట్ సిక్కూ మతానికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరు హిందూ వ్యక్తి ఉన్నారు. చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారానికి ముందు రూప్ నగర్ గురుద్వారాను సందర్శించి ప్రార్థనలు చేశారు.