Priyanka Gandhi at Bharat Bachao Rally (Photo Credits: ANI)

New Delhi, December 14 : బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ (Congress) పిలుపునిచ్చిన 'భారత్ బచావో' ర్యాలీకి(Bharat Bachao Rally) వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారు. ఢిల్లీ(Delhi)లోని రామ్‌లీలా గ్రౌండ్స్‌( Ramlila Maidan) వేదికగా ఈ ర్యాలీ జరుగుతోంది. కాగా మోడీ (PM Modi) ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీకి పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ సహా….కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు సహా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, ఆర్థిక అస్తవ్యస్తత ఇలాంటి అంశాలపై దశలవారీ పోరాటానికి కాంగ్రెస్ రెడీ అయింది.

దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో పలుచోట్ల నిరసనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కేంద్రాన్ని మరింత ఇరకాటంలో పడేసేందుకు రామ్‌లీలా గ్రౌండ్స్‌ వేదికగా కాంగ్రెస్ పార్టీ 'భారత్ బచావో' పేరుతో భారీ ర్యాలీని తలపెట్టింది. కాగా, 'భారత్ బచావ్ ర్యాలీ' నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ప్రియాంకా గాంధీ వాద్రా స్పీచ్

నిర్దిష్టమైన మార్గాల్లో వాహనాదారులు రావద్దని ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ గేట్, రాజ్‌ఘాట్ నుంచి జేఎల్ఎన్ మార్గ్, గురునానక్ చౌక్ నుంచి అజ్మీరీ గేట్, కమ్లా మార్కెట్ తదితర మార్గాలను మూసివేసింది. ముందు జాగ్రత్త చర్యగా రూట్ డైవర్షన్లు కూడా చేపట్టింది. పలు బస్సులను రూటు మళ్లించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

అన్ని వ్యవస్థలు నాశనం : ప్రియాంకా గాంధీ వాద్రా

భారత్ బచావో' ర్యాలీలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రసంగించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. దేశాన్ని అమితంగా ప్రేమిచే ప్రజలంతా కలిసికట్టుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వ్యవస్థలు నాశనం అవుతున్నాయని ఆమె విమర్శించారు.'ఆర్థిక వృద్ధిని కోల్పోయాం. ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశ ప్రజలంతా స్పందించాల్సిన అవసరం వచ్చింది.

ప్రజలు మౌనం వహిస్తే మన రాజ్యాంగాన్ని కూడా నాశనం చేస్తారు. చీకటిలో, భయంలో కూరుకుపోతాం. బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారు' అని ప్రియాంక వ్యాఖ్యానించారు. 'దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోయింది.. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఎన్నడూలేని విధంగా ధరలు విపరీతంగా పెరిగాయి. ధరలను అదుపు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది' అని ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు.