Cheating Case Filed Against Prashant Kishor over Baat Bihar Ki campaign (Photo-PTI)

New Delhi, Dec 3: దేశంలో అసలు యూపీఏనే లేదు’ అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజీకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు మరింత ఆజ్యం పోస్తూ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం (Congress leadership ) వహించడం ఏ వ్యక్తికి దైవదత్తంగా సంక్రమించే హక్కు కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. విప‌క్ష నేత‌ను ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా నిర్ణ‌యించాల‌ని రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ (poll strategist Prashant Kishor) వ్యాఖ్యానించారు.

గత పదేళ్ల కాలంలో 90 శాతానికి పైగా ఎన్నికల్లో ఓడిపోయిన ఒక పార్టీకి నేతృత్వం వహించే హక్కు దానంతట అదే రాదని పేర్కొన్నారు. మమతా బెనర్జీ యూపీఏ కూటమి (UPA) లేదంటూ కామెంట్లు చేసిన మర్నాడే ఈ వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. దేశ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక స్థానం ఉందని, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్‌ అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రతిపక్ష కూటమికి సారథి ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ప్రశాంత్ కిషోర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్ర‌శాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ మండిప‌డ్డారు. ప్రజాస్వామ్యంపై పీకే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ నేత‌ల ప్ర‌జాస్వామిక ఎంపిక‌ను ప్ర‌శ్నించేందుకు ఆయ‌న దైవ‌త్వాన్ని ఎంపిక చేసుకున్నారు. రాజ‌కీయాలంటే కేవ‌లం ఎన్నిక‌లు గెల‌వ‌డం కోస‌మే కాద‌ని వ్యాపారికి ఎలా అర్ధం అవుతుంద‌ని స‌ల్మాన్ ఖుర్షీద్ పీకే వ్యాఖ్య‌ల‌పై చుర‌క‌లు వేశారు. దైవత్వం విశ్వాసానికి సంబంధించింది..ప్ర‌జాస్వామ్యం విశ్వాసంతో ముడిప‌డిన‌దే..ప్ర‌జాస్వామ్య ఎంపిక కోసం ఇత‌రులు స్క్రిప్ట్ రాయ‌లేరు..ప్ర‌జాస్వామిక ఎంపిక అర్ధం కాకుంటే తిరిగి స్కూల్‌కు వెళ్లి మ‌ళ్లీ నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టండ‌ని పీకేకు క్లాస్ పీకారు. విశ్వాస‌మే బీజేపీకి దీటైన స‌మాధానం ఇస్తుంద‌ని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.

ఇంకెక్కడి యూపీఏ, అదంతా గడిచిన చరిత్ర, యూపీఏపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు, శరద్‌ పవార్‌తో దీదీ కీలక భేటీ

ఇక యూపీఏ కూటమే లేదంటూ మమత చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ తిప్పికొట్టారు. కాంగ్రెస్‌ లేని యూపీఏ అంటే ఆత్మ లేని శరీరం వంటిదన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తమ పార్టీ మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీని ఓడించడం సాధ్యం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత గురువారం స్పష్టం చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలనూ తిప్పికొట్టారు. ఇతర పార్టీల ఎజెండా ఏంటో ప్రశాంత్‌ ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలో సలహాలిచ్చుకునే స్వేచ్ఛ ఆయనకు ఉందని, కానీ మరో పార్టీ ఎజెండాపై ఎలా మాట్లాడాతారని నిలదీశారు.‘మమతది పచ్చి రాజకీయ అవకాశవాదం. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలను ఎదుర్కొంటున్నట్లు నటిస్తూ అదే ఫాసిస్టు శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారు’ అని రణ్‌దీప్‌ సూర్జేవాలా ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ తలపెట్టిన వివిధ సామాజిక, రాజకీయ అంశాల్లో టీఎంసీని కలుపుకుపోవాలని ప్రయత్నించామని కాంగ్రెస్‌ రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. ప్రతిపక్షాలు తమలో తాము కొట్లాడుకోకుండా, బీజేపీకి వ్యతిరేకంగా చేసే పోరాటంలో చేతులు కలపాలని కోరారు. మమత తీరు బీజేపీకి ప్రయోజనం కలిగించేలా ఉందని, ఆమె మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ లోక్‌సభా పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి ఆరోపించారు. కాంగ్రె్‌సను బలహీనపర్చేందుకు, పవార్‌ పరువు తీసేందుకు మమత కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి మమత ఆక్సిజన్‌ సప్లయర్‌లా తయారయ్యారని మండిపడ్డారు.

దేశ రాజకీయాల్లోని వాస్తవికత గురించి అందరికీ తెలుసని, తమ పార్టీ మద్దతు లేకుండా బీజేపీని ఓడించగలమని అనుకుంటే అది కలగానే మిగిలిపోతుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తోన్న ‘విభజించి పాలించు’ విధానానికి మద్దతిచ్చే రాజకీయాలకు పాల్పడకూడదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ అన్నారు. కాగా, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ప్రతిపక్షానికి నాయకత్వం వహించాలని కాంగ్రెస్‌, టీఎంసీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని సీపీఎం పేర్కొంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన నిరంతర ఐక్య పోరాటం నుంచి ప్రతిపక్షాలు గుణపాఠం నేర్చుకోవాలని సూచించింది.