'Alcohol Remove Coronavirus': మద్యం షాపులు తెరవాల్సిందే..! ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్, అల్కాహాల్ సేవించడం వల్ల గొంతు నుండి కరోనావైరస్ తొలగిపోతుందని వాదన
Alcohol | Image used for representational purpose (Photo Credits: IANS)

Jaipur, May 1: ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంతో బాధ్యతగా మెలగాల్సిన ప్రజాప్రతినిధి ఒకరు అవివేకంగా చేసిన వ్యాఖ్యలతో విమర్శల పాలయ్యారు. రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఒకరు రాష్ట్రంలో మద్యం దుకాణాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను డిమాండ్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తి కట్టడి నేపథ్యంలో విధించబడిన లాక్డౌన్ నుంచి మద్యం దుకాణాలకు మినహాయించి. మద్యం సేవించడాన్ని ప్రోత్సహించాలి అనేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగడం వల్ల COVID-19 కి కారణమయ్యే వైరస్ చంపబడుతుందని ఆయన వింత వాదన లేవనెత్తారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని సంగోడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్‌పూర్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తూ సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఒక లేఖ రాశారు. అదే లేఖను మీడియాకూ విడుదల చేశారు.

"ఆల్కహాల్ సంబంధిత శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం ద్వారా కరోనావైరస్ ను నివారించగలిగినపుడు, మద్యం సేవించడం వల్ల గొంతు నుండి ఆ వైరస్ తొలగిపోతుంది" అనేది ఎమ్మెల్యే భరత్ సింగ్ లేఖలోని సారాంశం.

See Letter Copy Here

మద్యం సేవించడం ద్వారా శరీరంలో ఉన్న కరోనావైరస్ తొలగించబడదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇదివరకే ధృవీకరించింది. అందుకు విరుద్ధంగా మద్యపానం శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది కోవిడ్-19 హెచ్చుకు మరింత దోహదపడుతుందని స్పష్టం చేసింది.

65 శాతం కంటే ఎక్కువ అల్కాహాల్ ఉన్న శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ మన చేతుల ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశించకుండా అడ్డుకునే అవకాశం ఉంది, కానీ ఆ ద్రావణాన్నే సేవిస్తే ప్రాణాలకే ప్రమాదం అనేది వైద్యుల మాట. ఇప్పటికే చాలా మంది ఆ తరహా చర్యలు చేసి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు దేశంలో చాలా జరిగాయి.

అలాగే మద్యంలో ఉండే అల్కాహాల్ శాతం కూడా చాలా తక్కువ బీర్లలో అయితే గరిష్టంగా 8 శాతం, ఇతర మద్యం బ్రాండ్లలో అయితే 42 శాతానికి మించి ఉండదు. కాబట్టి మద్యం సేవించడం ద్వారా ఎలాంటి వైరస్ చావకపోగా, అది రోగాని మరింత హెచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. గత వారం విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, "నిమిషాల్లోనే వైరస్‌ను చంపగల క్రిమిసంహారక మందులు నేరుగా మానవ శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా వైరస్ ను ఎలా చంపవచ్చో అనే దానిపై పరిశోధనలు జరగాలి" అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతటి ఉన్నత హోదా కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అంతా నివ్వెరపోయారు. క్రిమిసంహారక తయారీదారులైన లైజాల్, డెటోల్ తదితర కంపెనీలు క్రిమిసంహారక మందులు శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం లేదా నేరుగా సేవించడం అత్యంత హానికరం అంటూ గట్టి హెచ్చరికలు చేశాయి.

ట్రంప్ ప్రకటనల పట్ల విమర్శలు వెల్లువెత్తడంతో అవి సీరియస్ గా చేసినవి కావు, వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అంటూ వైట్ హౌజ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అప్పట్నించి డొనాల్డ్ ట్రంప్ మొత్తంగా ప్రెస్ మీట్లకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.