Congress MP Revanth Reddy | File Photo

Hyderabad, September 18:  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల కంటే బీజేపీ నేతలే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్థంగా నిలదీస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపైనే ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ లాబీలో మీడియా పాయింట్ వద్ద రేవంత్ మాట్లాడుతూ శాసన సభ బడ్జెట్ సమావేశాల తీరును ఎండగట్టారు. బడ్జెట్ సమావేశాలు 14 రోజుల కంటే తక్కువ జరగడం నిబంధనలకు విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు 2 వారాలకు తక్కువగా జరిగితే అవి చెల్లవు, అసెంబ్లీ రూల్స్ బుక్ లోనే ఈ నిబంధనలు ఉన్నట్లు రేవంత్ పేర్కొన్నారు.

చట్ట సభలో విద్యుత్ పై చర్చ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేకపోవడం సరికాదని చెప్పిన రేవంత్, దీని గురించి తమ పార్టీ నేతలను అడిగేందుకే తాను అసెంబ్లీకి వచ్చానని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నరును కలిసేందుకు వెళ్లారని దీనిపై కూడా తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు పదవి వస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత, అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసిన హుజూర్ నగర్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన హుజూర్ నగర్ టికెట్ ను తన భార్య పద్మావతి రెడ్డికి కేటాయించారు. అయితే రేవంత్ మాత్రం టీపీసీసీ అధ్యక్షుడికి విరుద్ధంగా వెళ్తున్నారు. హుజూర్ నగర్ టికెట్ ను అధిష్ఠానం ఇంకా ఎవరికీ కేటాయించలేదని రేవంత్ పేర్కొన్నారు. ఆ స్థానానికి తాను శ్యామల కిరణ్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

నల్లమలలో యురేనియం మైనింగ్ గురించి కూడా మాట్లాడిన రేవంత్ , తమ పార్టీ ఎమ్మెల్యే అయిన సంపత్ కుమార్ కు యురేనియం గురించి ఏబీసీడీలు కూడా తెలియవని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సంపత్ కు పవన్ కళ్యాణ్ సెల్ఫీ ఇవ్వకపోతే దానికి నేనేం చేయాలంటూ వ్యాఖ్యానించారు.

ఈ కొద్ది సేపట్లోనే రేవంత్ రెడ్డి రాజకీయ దుమారం రేపారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా రేవంత్‌ను బీజేపిలోకి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారని, గతంలో కూడా చంద్రబాబు సూచన మేరకే ఆయన కాంగ్రెస్ లో చేరారని ఒక వర్గం రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణ. నేడు సొంత పార్టీ నేతల పైనే రేవంత్ విమర్శణాస్త్రాలు సంధించడం పట్ల ఆయన పార్టీ మారడంపై వచ్చే ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది.