Motera-Stadium. | Photo: Twitter/ BCCI

Ahmedabad, February 25:  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్‌లో గల మోమొతేరా స్టేడియం పేరుపై ఇప్పుడు రాజకీయంగా మరియు సోషల్ మీడియాలో దుమారం చెలరేగుతోంది.

ఈ స్టేడియానికి సర్ధార్ పటేల్ స్టేడియం అని కాకుండా నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు స్టేడియానికి పేరు మార్చడాన్ని తప్పుపట్టాయి. ఇది సర్ధార్ పటేల్ కు జరిగిన అవమానంగా పేర్కొన్నాయి.

అయితే పేరు మార్పును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. మోతేరా స్టేడియానికి మాత్రమే నరేంద్ర మోదీ పేరు ఉంటుందని, ఇక్కడి క్రీడా సముదాయం మాత్రం సర్ధార్ పటేల్ పేరుతోనే కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రతిపక్షాల విమర్శలపై కేంద్ర మంత్రులు, ఇతర బీజేపీ నాయకులు ఘాటుగా జవాబిస్తున్నారు.

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు సర్ధార్ పటేల్ గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఎప్పుడైనా ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రశంసించారా ? ఒక్కసారైనా ఈ విగ్రహాన్ని సందర్శించారా? అని ప్రశ్నించారు.

"ప్రపంచ ప్రశంసలు పొందిన పర్యాటక స్థలాన్ని కాంగ్రెస్ నాయకులు ఇప్పటివరకు సందర్శించలేదు కనీసం ఒక్కసారి కూడా ఈ విగ్రహాన్ని ప్రశంసించలేదు. ఇంకా వారు సర్ధార్ పటేల్ గురించి మాట్లాడటం ఏంటి" అని రవిశంకర్ అన్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ పేరు మార్పుపై భారీ ట్రోలింగ్ జరుగుతోంది. బుధవారం మోతేరా స్టేడియం వేదికగా ఇండియా - ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ కంటే ఎక్కువగా స్టేడియం పేరుపైనే మీమ్స్, జోక్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా బౌలర్స్ బౌలింగ్ వేసేటపుడు 'నరేంద్ర మోదీ స్టేడియం - రిలయన్స్ పెవిలియన్ ఎండ్ - అదాని ఎండ్' అని టీవీ స్క్రీన్లపై చూపించడంతో ఇదే ప్రధాని మోదీ కార్పోరేట్ రియాల్టీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.