New Delhi, February 11: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2020) ఆమ్ ఆద్మీ పార్టీ Aam Aadmi Party) ఘనవిజయం సాధించింది. 'చీపురుకట్ట' ప్రతిపక్షాలను మరోసారి ఊడ్చిపారేసింది. దిల్లీలో 70 స్థానాలకు గానూ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal ) నేతృత్వంలో ఆప్ (AAP) 62 స్థానాలను కైవసం చేసుకుంది.
ఇక ఒకానొక దశలో 15 నుంచి 20 స్థానాలు గెలుస్తామని అంచనా వేసుకున్న బీజేపీకి ఈ ఫలితాలు షాక్ ఇచ్చాయి. కౌంటింగ్ చివరికి వచ్చేసరికి భాజపా కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ సహా ఇతరులెవ్వరూ చీపురుకట్ట దెబ్బకు కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన 5 జాతీయ పార్టీల అడ్రస్‌లు గల్లంతయ్యాయి. ఈ విజయంతో అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడు సార్లు సీఎం అవుతూ హాట్రిక్ కొట్టారు.
ఫలితాల పట్ల అర్వింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. ఫలితాల అనంతరం భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజలు తనను ఒక కొడుగా భావించి దీవించారని, ఈ విజయం వారిదేనంటూ తనను గెలిపించిన దిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు.
దిల్లీ ఫలితాలు ఇచ్చిన జోష్‌తో , అర్వింద్ కేజ్రీవాల్ కూడా ఈ వేలైంటైన్ వీక్‌లో లవర్ బాయ్‌గా మారిపోయారు. ఆయన మాట్లాడుతూ "దిల్లీ వాలో గజబ్ కర్ దియా ఆప్ లోగోనే.. ఐ లవ్ యూ" (దిల్లీ ప్రజలారా.. పిచ్చెక్కించేశారు మీరు.. ఐ లవ్ యూ) అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారు. కేజ్రీవాల్ చేసిన ఈ కమెంట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోయింది, అప్పటికప్పుడే టిక్‌టాక్‌లో కూడా వీడియోలు చేయడం కూడా మొదలుపెట్టేశారు.
Here's Kejriwal's Crazy Statement:
#WATCH Delhi: AAP chief Arvind Kejriwal at the party office says, "Dilli walon ghazab kar diya aap logon ne! I love you." #DelhiElectionResults pic.twitter.com/8LeW9fr4EL
— ANI (@ANI) February 11, 2020
"భారత్ మాతా కీ జై.. ఇంక్విలాబ్ జిందాబాద్.. వందేమాతరం" అంటూ తన స్పీచ్ ప్రారంభించిన కేజ్రీవాల్ ఈ విజయం కేవలం దిల్లీది మాత్రమే కాదని, మొత్తం దేశ ప్రజలదని వ్యాఖ్యానించారు. ప్రజలు అభివృద్ధి, మెరుగైన విద్య, ఆరోగ్యం, సంక్షేమం కోరుకొని ఓటు వేశారని చెప్పారు. ఆ హనుమంతుడి దయతో తమ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతూ వచ్చే మరో ఐదేళ్ల కాలం వరకు ప్రజలకు సేవ చేస్తుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ని షేక్ చేస్తోన్న మినీ మఫ్లర్ మ్యాన్, చిన్నారి ఫోటోకు కేజ్రీవాల్ ఫిదా!
ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి, 69.59 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక ఫిబ్రవరి 11న అంటే ఈరోజు ఫలితాలు వెల్లడయ్యాయి. ఈరోజు వెలువడిన ఫలితాలు కేజ్రీవాల్‌కు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆయన సతీమణి సునీత పుట్టినరోజు కావడం కూడా ఒక విశేషం.
ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే ప్రేమికుల రోజు తేదీ ఫిబ్రవరి 14 కేజ్రీవాల్ కు ఎంతో ప్రత్యేకమైంది. గతంలో 2014లో కాంగ్రెస్ తో విబేధాల కారణంగా ఫిబ్రవరి 14న సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. తిరిగి 2015లో ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ 2020లో కూడా ఫిబ్రవరి 14వ తేదీనే కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. అందుకే కేజ్రీవాల్ దిల్లీ ప్రజలకు లవర్ బాయ్ అయ్యారు.