Devendra Fadnavis and Anantkumar Hegde (Photo- Facebook)

Mumbai, December 2: మహారాష్ట్రలో బీజేపీ(BJP) పార్టీని ఇప్పుడు కొత్త వివాదాలు చుట్టుముట్టేలా ఉన్నాయి. అనూహ్య మలుపుల మధ్య రాత్రికి రాత్రే దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. తరువాత బల పరీక్షలో నెగ్గలేమని తెలిసి రాజీనామా చేశారనే సంగతి కూడా తెలిసిందే. అయితే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే (BJP MP Anant Kumar Hegde) ఆసక్తికర కామెంట్ చేశారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మాజీ కేంద్ర మంత్రి (Former Union minister)అనంతకుమార్ హెడ్గే సంఖ్యాబలం లేకుండానే బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు ముందడుగు వేసిందనే దానిపై ఊహించని విధంగా బాంబు పేల్చారు.

మహారాష్ట్ర అభివృద్ధి పనుల కోసం కేంద్రం కేటాయించిన రూ.40వేల కోట్ల నిధులను(Rs.40k Crore Central Funds) వినియోగించుకునేందుకు సీఎంకు అధికారం ఉంటుందని చెప్పిన హెడ్గే.. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు ప్రభుత్వంలోకి వస్తే అభివృద్ధి పేరుతో ఆ నిధులను దుర్వినియోగం చేస్తాయని దేవేంద్ర ఫడ్నవీస్‌ ముందే గ్రహించారని చెప్పారు.

బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలు 

ఈ క్రమంలోనే ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూసేందుకే డ్రామా ఆడారని వెల్లడించారు. 15 గంటల్లోనే సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారని వెంటనే ఆ రూ.40వేల కోట్ల నిధులను తిరిగి కేంద్రంకు పంపించారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అందుకే 80 గంటలు మెజార్టీ లేకపోయినా శరద్ పవార్ సాయంతో సీఎంగా ఉన్నారని తెలిపారు.

అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలను ఖండించిన మాజీ సీఎం

ఈ వ్యాఖ్యలను మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ వెంటనే ఖండించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న 80 గంటల్లో ఎలాంటి నిధులు కేంద్రానికి తిరిగి పంపలేదని చెప్పారు. అంతేకాదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా అలాంటి నిర్ణయాన్ని తాను తీసుకోలేదని స్పష్టం చేశారు. అనంతకుమార్ హెడ్గే ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారో తనకు తెలియదని చెబుతూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. అదే సమయంలో అసత్య ప్రచారం చేయకూడదని సూచించారు.

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ 

వీరిద్దరి మధ్య వివాదం ఇలా కొనసాగుతుంటే మధ్యలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sena MP Sanjay Raut) బీజేపీపై నాలుగు రాళ్లు వేశారు. అనంత్ కుమార్ హెడ్గే చేసిన ఆరోపణలపై శివసేన సీనియర్ ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ.. మహారాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని అన్నారు. సంఖ్యాబలం లేకపోయినప్పటికీ వెనువెంటనే ప్రమాణస్వీకారం ఎందుకు చేశారని రౌత్ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. సొంత పార్టీ నేత అనంత్ కుమార్ వ్యాఖ్యలు నిజమై ఉండొచ్చేమో అని రౌత్ అన్నారు. ఇందుకోసమే బీజేపీ సీఎం పీఠం మీద కూర్చుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.