Assembly Polls 2021: కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ప్రధాని మోదీ ఫోటో ఉండటాన్ని తప్పుపట్టిన టీఎంసీ పార్టీ, ఎన్నికల నియమావళి అమలులో ఉన్న రాష్ట్రాలలో ప్రధాని ఫోటో తొలగించాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం
File image of PM Narendra Modi (Photo Credits: ANI)

New Delhi, March 6: ఎన్నికల కోడ్ నియమావళి అమలులో ఉన్న రాష్ట్రాల్లో కోవిడ్ నివారణ యొక్క టీకా సర్టిఫికెట్లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటోలను తొలగించాలని భారత ఎన్నికల సంఘం కేంద్రాన్ని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

కో-విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా జారీ చేయబడుతున్న టీకా సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో ఉండటాన్ని తప్పు పట్టిన టీఎంసీ పార్టీ ఎన్నికల విధివిధానాల ఉల్లంఘనకు  సంబంధించి పోల్ ప్యానెల్‌ను సంప్రదించింది. టీఎంసి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ, దీనిని ధృవీకరించడానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారి నుండి నివేదిక కోరింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ఈసీఓ ఇచ్చిన నివేదిక మేరకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటు అస్సాం, కేరళ, తమిళనాడు, మరియు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో కోవిడ్ టీకా తీసుకున్నట్లు జారీ చేయబడే ధృవీకరణ పత్రాలలో ప్రధాని ఫోటో కనిపించని విధంగా ఒక వ్యవస్థను అవలంబించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.

దేశంలో పైన పేర్కొన్న నాలుగు రాష్ట్రాలు మరియు ఒక యూటీలో మార్చి 27 నుండి వివిధ దశల్లో ఎన్నికల కోసం ఈసీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.  అస్సాంలో మూడు దశల్లో, మరియు పశ్చిమ బెంగాల్ లో 8 దశల్లో జరిగే ఎన్నికలకు మార్చి 27 నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుండగా, కేరళ, తమిళనాడు మరియు పుదుచ్చేరిలో అన్ని నియోజకవర్గాలకు కలిపి ఒకే విడతలో ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, వీటి కౌంటింగ్ మరియు ఫలితాల వెల్లడి మే 2న జరుగనుంది.

వీటితో పాటు దేశంలోని 16 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 34 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే వీటికి ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.