Goa Assembly Election Results 2022: గోవాలో కింగ్ మేకర్ ఎవరు కాబోతున్నారు, 40 స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే..
Goa Assembly Election Results 2022

Panaji, March 10:  ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడనుందనే ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో గోవాలో (Goa Assembly Election Results 2022) రాజకీయ కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముందు జాగ్రత్తగా, కాంగ్రెస్‌ తన అభ్యర్థులందరినీ రిసార్టులో క్యాంప్‌ వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

బీజేపీకి చెందిన ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్టీ సీనియర్‌ నేతలంతా గోవా ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమై చర్చలు జరపాలని నిర్ణయించుకున్నారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14వ తేదీన పోలింగ్‌ పూర్తవ్వగా నేడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్‌ ఫోల్‌ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ప్రారంభమైన కౌంటింగ్, 5 రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓట్ల లెక్కింపు

గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్‌ఎక్స్‌ ఎగ్జిట్ పోల్‌ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్‌ తప్పనిసరైతే.. కింగ్‌ మేకర్‌గా ఎవరు మారనున్నారో నేడు తేలనుంది.