Sushma Swaraj: 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపు, ఆపై కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకరం. దివంగత నేత సుష్మా స్వరాజ్ జీవితంలోని కొన్ని అరుదైన ఘట్టాలు.
Sushma Swaraj | File Image | (Photo Credits: PTI)

బీజేపీ సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (67)  ఆగష్టు 06, 2019 మంగళవారం రాత్రి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 'చిన్నమ్మ' హఠాన్మరణం యావత్ భారతావనిని దిగ్భ్రాంతిని గురిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బిజేపీ శ్రేణులు, దేశంలోని ఇతర పార్టీల నాయకులందరూ ఆమె మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

నిండైన చీరకట్టు, నుదుటన కొంకుమ బొట్టుతో అచ్ఛమైన భారతీయతకు ప్రతిరూపంగా నిలిచే సుష్మా స్వరాజ్ రాజకీయ క్షేతంలో ఒక డైనమిక్ లీడర్, సహాయం కోరితే ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా సరే, నేనున్నానంటూ కొండంత ధైర్యాన్నిచ్చే ఆత్మ బంధువు. సాధారణ స్థాయి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగి వివిధ హోదాల్లో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఊరికే మాట ఇవ్వదు, మాట ఇస్తే ఎంత కష్టమైనా మడమ తిప్పదు.

భారతదేశంలోనే అందరికంటే ఎక్కువ ప్రేమాభిమానాలు పంచిన, అందుకున్న ఏకైక రాజకీయ నేత సుష్మా స్వరాజ్ జీవితంలోని కొన్ని అరుదైన విషయాలు తెలుసుకోండి.

హరియాణలోని అంబాలా పట్టణంలో 1952లో జన్మించింది సుష్మా స్వరాజ్. వివాహానికి ముందు ఆమె పేరు సుష్మా శర్మ. హైకోర్ట్ లాయర్ స్వరాజ్ కౌశల్ ను 1975లో వివాహమాడిన తర్వాత సుష్మా స్వరాజ్ గా మార్చుకుంది.

చదువు

సుష్మా చదువంతా అంబాలాలోనే సాగింది. 'సనాతన ధర్మ' కాలేజీ నుంచి సంస్కృతం మరియు పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ పట్టాపొందిన సుష్మా, ఆ తర్వాత పంజాబ్ యూనివర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందింది.

NCC సభ్యురాలు

పాఠశాల వయసు నుంచే సుష్మా ఎంతో క్రమశిక్షణ పాటించేది. NCCలో సభ్యత్వం తీసుకున్న ఆమె వరుసగా మూడు పర్యాయాలు ఉత్తమ ఎన్ సీసీ కేడేట్ గా అవార్డు అందుకుంది.

మంచి భాషా ప్రావీణ్యం, ఉపన్యాసాలలో దిట్ట.

సుష్మా స్వరాజ్ కు హిందీ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. కాలేజీ చదివే రోజుల్లో సుష్మా వాగ్ధాటికి, ఆమె ఉపన్యాసాలకు భాషా సంస్కృతిక శాఖ, పంజాబ్ నుంచి నుంచి ఆమెకు వరుసగా మూడు సార్లు అవార్డు లభించింది.

కెరియర్ ప్రారంభం

1973లో 21 ఏళ్లకే కాలేజీలో తన సహచరుడినే పెళ్లి చేసుకున్న సుష్మా భర్త ప్రోత్సాహంతో అదే ఏడాది నుంచి సుప్రీం కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించింది.

రాజకీయ ప్రస్థానం.

కాలేజీలో చదివే రోజుల్లో నుంచే ABVP సభ్యురాలిగా ఉన్న సుష్మా స్వరాజ్ , 1977 ఎన్నికల్లో గెలిచి, 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా హరియాణ అసెంబ్లీలో అడుగుపెట్టింది. అంతేకాదు అదే ఏడాది రాష్ట్ర కేబినేట్ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసింది. అక్కడ్నించి సుష్మా వెనుదిరిగి చూసుకోలేదు. అనేక ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఎంపీగా, కేంద్రమంత్రిగా, 40 ఏళ్లకే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో మంత్రుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో చిన్న వయసులోనే పనిచేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్లారు.

బీజేపికి తొలి ముఖ్యమంత్రి, తొలి ప్రతిపక్ష నేత కూడా తనే. ఒకసారి బల్లారీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీపై పోటీకి కేవలం 12 రోజులు మాత్రమే ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఓట్ల శాతంలో తేడా కేవలం 7% మాత్రమే. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ మంత్రిగా చేసిన మహిళ కూడా సుష్మానే. సుష్మా- స్వరాజ్ దంపతులకు ఒకకూతురు ఉంది, ఆమె కూడా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందింది.

తెలంగాణ చిన్నమ్మ

ఉద్యమ సమయం నుంచి తెలంగాణ విషయంలో ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్నిసార్లు మాటలు మార్చినా, సుష్మా స్వరాజ్ మాత్రం ఒకే మాటపై నిలబడింది. తెలంగాణ ఉద్యమానికి మనస్పూర్థిగా మద్ధతిచ్చిన ఆమె, పార్లమెంటులో బిల్లు పాసవడంలో కీలకపాత్ర వహించారు. అప్పట్నుంచే తాను తెలంగాణకు చిన్నమ్మగా వివిధ వేదికలపై చెప్పుకుంటూ వచ్చారు.

మోడీ సర్కార్ లో గత టర్మ్ లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సుష్మా స్వరాజ్, ఆనారోగ్య కారణాలరీత్యా ఈ సారి ఎన్నికల్లో పోటీనే చేయలేదు. ఇటీవలే ఏపీకి కొత్త గవర్నరును నియమించిన కేంద్రం, తెలంగాణకు సుష్మా స్వరాజ్ ను గవర్నర్ గా నియమిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఆ విషయంపై తెలంగాణ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసి ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇక ఆమె ఎన్నటికీ తిరిగి రారనే విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇదీ, సుష్మా స్వరాజ్ ప్రస్థానం. దేశంలో ఎంతమంది నాయకులు, మహిళా నేతలు వచ్చినా. సుష్మా స్వరాజ్ ఎప్పటికీ ప్రత్యేకం.