Hyderabad-Karnataka Region Renamed as Kalyana Karnataka ( File Photo )

Karnataka,September 18:  దశాబ్దాల నుంచి కర్ణాటక రాష్ట్రంలో ఓ ప్రాంతానికి వినిపిస్తున్న తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక రీజియన్ ( Hyderabad Karnataka Region)పేరును మారుస్తూ సీఎం యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఈ ప్రాంతం కళ్యాణ కర్ణాటక( Kalyana Karnataka)గా కొత్త రూపును సంతరించుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ రికార్డులలో హైదరాబాద్ కర్ణాటక బదులు కళ్యాణ కర్ణాటక పేరు వినపడుతుందని కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కెసి మధుస్వామి మీడియాకు తెలిపారు.

హైదరాబాద్ నిజాం కాలానికి చెందిన పేరును ఇంకా కొనసాగించడంపై ఆ ప్రాంతానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలియచేస్తూ లేఖలు ఇవ్వడంతో క్యాబినెట్ సమావేశంలో పేరు మార్పుకు సంబంధించి బీ ఎస్ యడ్యూరప్ప ( BS Yeddyurappa) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ జిల్లాల అభివృద్ధి కోసం కొత్త సెక్రెటేరియట్ కూడా ఏర్పాటు చేయనున్నట్టుగా సీఎం యడ్యూరప్ప ప్రకటించారు. అలాగే పెద్ద ఎత్తున నిధులను గ్రాంటు రూపంలో విడుదల చేస్తామని చెప్పారు.

కల్యాణ కర్నాటక ప్రాంతీయ అభివృద్ధి బోర్డు

హైదరాబాద్-కర్నాటక ప్రాంతంలో బీదర్, బళ్లారి, రాయచూర్, కొప్పల్, యాద్గిర్, గుల్బర్గా జిల్లాలు అంతర్భాగంగా ఉన్నాయి. రాజ్యాంగంలోని 371జె అధికరణ కింద ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి లభిస్తోంది. ఈ ప్రాంత ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ లభిస్తుంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హైదరాబాద్-కర్నాటక ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ( Hyderabad Karnataka Regional Development Board (HKRDB)ఏర్పడి ఉంది. ఇప్పుడు ఈ బోర్డును కల్యాణ కర్నాటక ప్రాంతీయ అభివృద్ధి బోర్డుగా పిలుస్తారు. ఈ బోర్డుకు చైర్మన్‌గా జిల్లా ఇన్‌చార్జి మంత్రులలో ఒకరు ఉంటారు.

దశాబ్దాలుగా డిమాండ్

స్వాతంత్య్రానికి పూర్వం ఈ ప్రాంతం హైదరాబాద్ నిజాం నవాబు పాలనలో ఉండేది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. అయితే నిజాం కాలం గడిచిపోయినా అప్పటినుంచి ఆపేరు అలాగే ఉండిపోయింది. సంస్థానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్రంలో కలిసిపోయింది. హైదరాబాద్ విలీనం తర్వాత కర్నాటకలోని ఈ ప్రాంతాన్ని హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంగా పిలుస్తున్నారు. కన్నడ ప్రజలు ఈ పేరు మార్చాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండును దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది.

కలబురిగి వేదికగా నిర్ణయం

హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడాని కలబురిగికి చేరుకున్న సీఎం యడ్యూరప్ప ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాగా ఈ ఆరు జిల్లాల్లో తెలుగు వారి ప్రాబల్యమే అధికంగా ఉంది. తెలుగు మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాల్లోనూ ఇదే పేరు కనిపిస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు నగరాల పేర్లను మారుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.