Lucknow, March 17: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) మూవీపై కీలక కామెంట్లు చేశారు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav). ఈ మూవీని బీజేపీ సపోర్ట్ చేస్తున్నందుకు ఆయన ఫైర్ అయ్యారు. కశ్మీర్ లోయలో జరిగిన హింసాత్మక ఘటనల పట్ల సినిమా తీయగలిగితే లఖీంపూర్ ఖేరీ ప్రాంతంలో జరిగిన అల్లర్లపై కూడా లఖీంపూర్ ఫైల్స్ (Lakhimpur Files) సినిమా తీయాలని అన్నారు. 2021 అక్టోబరు 4న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని, కేంద్ర మంత్రి అజయ్ తేనీ కొడుకు ఆశిష్ మిశ్రా (Ashish Misra) ఆరుగురిపై నుంచి కార్ నడిపాడని వ్యాఖ్యానించారు. అందులో నలుగురు రైతులు కూడా ఉన్నారని, కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ మీడియా ముందు ప్రస్తావించారు. బీజేపీ వల్ల జరిగిన హింస, నిరుద్యోగం, అభివృద్ధిల గురించి కూడా సినిమా తీయాలని సూచించారు.
కశ్మీర్ ఫైల్స్ మూవీపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో అక్కడ కశ్మీర్ పండిట్లను ఎలా హింసించారన్నది ఈమూవీలో చూపించారు. ఇది కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. అటు ప్రధాని మోదీ కూడా ద కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రశంసించారు. చరిత్రను యథావిధిగా చిత్రీకరించడం చాలా మంచి విషయమని అన్నారు. హోం మంత్రి అమిత్ షా బాలీవుడ్ సినిమాని సత్యానికి బోల్డ్ రిప్రజెంటేటివ్ గా అభివర్ణించారు. సినిమాలో కశ్మీరీ పండిట్స్ పడిన కష్టాలు, భరించలేని బాధలను హైలెట్ చేశారని వివరించారు.