
Mumbai, April 26: మహా రాజకీయాల్లో హనుమాన్ చాలీసా అంశం కాకరేపుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే (Hanuman Chalisa Row) పఠించాలని, తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే హనుమాన్ చాలీసా మాటున దాదాగిరి చేస్తే మాత్రం సహించేది లేదని సీఎం (CM Uddhav Thackeray) హెచ్చరించారు. దాదాగిరిని ఎలా అణచాలో తమకు బాగా తెలుసంటూ ఫైర్ అయ్యారు. తాము పక్కా హిందుత్వవాదులమని సీఎం ఉద్ధవ్ పునరుద్ఘాటించారు. బీజేపీ గనక దాదాగిరి చేస్తే… తమ భీమ రూపాన్ని, మహా రౌద్ర రూపాన్ని చూడాల్సి వస్తుందని సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గదా ధరుడైన హనుమంతుడిలాగా తమ హిందుత్వ భూమిక చాలా స్ట్రాంగ్‌గా వుందని సీఎం (Maharashtra CM Uddhav Thackeray) పేర్కొన్నారు.
తాము హిందుత్వ భూమికను విడిచిపెట్టామని బీజేపీ పదే పదే ప్రచారం చేస్తోందని, మేం ఏం విడిచిపెట్టామో చెప్పాలని సీఎం సవాల్ విసిరారు. హిందుత్వ అంటే కేవలం ధోవతి కట్టుకోవడమేనా? అంటూ ప్రశ్నించారు. హిందుత్వ విషయంలో తమను విమర్శించే వారు.. ఇంతకు వారు హిందుత్వకు ఏం చేశారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఉద్ధవ్ ఎద్దేవా చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పారిపోయారు.. దాక్కున్నారు. రామ మందిరాన్ని నిర్మించాలన్న నిర్ణయం బీజేపీది కాదు. అది కోర్టు ఇచ్చిన తీర్పు. అసలు మీరు ఆచరణలో హిందుత్వ భూమిక ఎక్కడుంది? అంటూ సీఎం ఉద్ధవ్ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఇక బీజేపీ నేతలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. హనుమాన్ చాలీసా పఠిస్తామంటే ఎలా ఇబ్బందీ లేదని రౌత్ స్పష్టం చేశారు. మనస్సు చికాకు ఉన్నప్పుడల్లా చాలీసాను పఠనం చేసుకోవచ్చని అన్నారు. అయితే… అది ఇతరుల ఇళ్లల్లోకి చొరబడి చేస్తేనే ఇబ్బందులు వస్తాయని అన్నారు. ఎవరైనా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామనుకుంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, అయితే… వారివారి ఇళ్లల్లోనో, మందిరాల్లోనో చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర ఇళ్లల్లోకి చొరబడి, ప్రశాంత వాతావరణాన్ని చెడగొడితేనే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని రౌత్ దుయ్యబట్టారు.