Kamal Haasan Warning To Amith Shah On Hindi Row - ( photo credit - Ians Facebook )

Chennai,September 16 : ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియాలో తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ఈ వ్యాఖ్యలు మరో ఉద్యమానికి తెరలేపబోతున్నాయి. మొత్తం దక్షిణ భారతదేశం ఏకమై దీనిని ఖండిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే అమిత్‌ షా వ్యాఖ్యలపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ( Stalin),ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. తాజాగా వీరి కోవలోకి మరో తమిళ నేత, మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ చేరారు.

హిందీ భాషను తమపై రుద్దడానికి ప్రయత్నించవద్దని,తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తామన్న వాగ్దానంతో భారతదేశం 1950లో రిపబ్లిక్‌గా అవతరించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందీని తమిళ ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తే జల్లికట్టును మించిన ఉద్యమాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని ఒక వీడియో సందేశంలో కమల్‌ హాసన్‌ ( Kamal Haasan) హెచ్చరించారు. ఏ షా, సుల్తాన్ లేదా సామ్రాట్ ఈ వాగ్దానాన్ని హఠాత్తుగా భగ్నం చేయలేరు ( No Shah, Sultan, Samrat can break promise). అన్ని భాషలను మేము గౌరవిస్తాం. కాని ఎప్పటికీ మా మాతృభాష తమిళమే అని తెలిపారు .

జల్లికట్టు కోసం జరిగింది కేవలం నిరసన మాత్రమే, కాని మా భాషను కాపాడుకునేందుకు జరిగేది మాత్రం మహా ఉద్యమమే అని ఆయన హెచ్చరించారు. ఎందరో మహారాజులు తమ రాజ్యాలను భారతదేశంలో విలీనం చేశారని, కాని ప్రజలు మాత్రం తమ భాష, సంస్కృతి, ఉనికిని మాత్రమే వదులుకోలేదన్నారు. భాష కోసం మరో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, మీరు ఆ దిశగా అడుగులు వేయవద్దని హెచ్చరించారు.

kamal haasan tweet

జాతీయ గీతం బెంగాలీ భాషలో ఉన్నప్పటికీ ప్రజలంతా ఎంతో సంతోషంగా దాన్ని ఆలపిస్తారని, అందుకు కారణం అన్ని భాషలను, సంస్కృతులను అందులో గౌరవించడమేనని కమల్ హాసన్ ఈ సందర్భంగా తెలిపారు. అన్ని భాషలను తనలో ఇముడ్చుకున్న భారతదేశాన్ని భాషాపరంగా చీల్చేందుకు ప్రయత్నించవద్దని, ఇలాంటి ముందు చూపులేని చర్యల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని పరోక్షంగా అమిత్ షాపై మండిపడ్డారు.

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌

డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ మేం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అమిత్‌ షా తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు.

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

ఇదిలా ఉంటే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ( Asaduddin Owaisi) తీవ్రంగా మండిపడ్డారు. దేశమంటే కేవలం హిందీ, హిందూ, హిందుత్వ కాదని వాటి కంటే ఎంతో భారత్‌ ఎంతో విశాలమైందని పేర్కొన్నారు. '' భారతీయులందరి మాతృభాష హిందీ కాదు. భరతభూమిపై ఎన్నెన్నో మాతృభాషలు ఉన్నాయి. వాటిలోని భిన్నత్వాన్ని, అందాన్ని తెలుసుకునేందుకు కాస్త ప్రయత్నించండి. భారత రాజ్యాంగంలోని 29వ అధికరణ తమకు నచ్చిన భాష మాట్లాడేందుకు, సంస్కృతీ సంప్రదాయాలు పాటించేందుకు అవకాశం కల్పిస్తుంది. హిందీ, హిందూ, హిందుత్వ కంటే ఇండియా చాలా పెద్దది '' అని అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు.

అసదుద్దీన్‌ ట్వీట్‌ 

కర్ణాటక కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య ట్వీట్‌

మేం హిందీని వ్యతిరేకించట్లేదు. బలవంతంగా రుద్దడాన్నే తప్పుపడుతున్నామని కర్ణాటక కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య ట్వీట్‌ చేశారు. జేడీఎస్‌ నేత కుమారస్వామి మాట్లాడుతూ ‘కేంద్రం హిందీ దినోత్సవాన్ని జరుపుతోంది. మిస్టర్‌ మోడీ మీరు కన్నడ దినోత్సవం ఎప్పుడు జరపబోతున్నారు? హిందీలాగే కన్నడ కూడా అధికార భాషే’ అని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే అక్టోబర్‌ 1 నుంచి ఉద్యమిస్తామని కన్నడ సంఘాలు కేంద్రాన్ని హెచ్చరించాయి.

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

ప్రజలు అన్ని సంస్కృతులను గౌరవించాల్సిందేనని టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అయితే అందుకోసం మాతృభాషను పణంగా పెట్టాల్సిన అవసరంలేదని అభిప్రాయపడ్డారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌

హోం మంత్రి అమిత్‌ షా ( Amith Shah ) ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే, కేంద్రం ఈ వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఫేస్‌బుక్‌లో ఆరోపించారు.

అమిత్‌ షా  ట్వీట్‌

హిందీ దివస్‌ సందర్భంగా అమిత్‌ షా ప్రసంగిస్తూ భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం విదితమే. ప్రపంచంలో భారత్‌ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని, దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే అని అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్‌ పటేల్‌ ఆశయాలను నెరవేర్చాలంటే మాతృభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్‌ వేదికగా భారత ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.

దేశంలో 44 శాతం మంది మాతృభాష హిందీయే

కాగా అధికార భాషల చట్టం–1963 ప్రకారం భారత పార్లమెంటు, ప్రభుత్వ వ్యవహారాల్లో హిందీ, ఇంగ్లిష్‌లను అధికార భాషలుగా గుర్తించారు. 1953 నుంచి ఏటా సెప్టెంబర్‌ 14న హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేశంలో 44 శాతం మంది మాతృభాష హిందీయే.

అమిత్‌ షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

ఏది ఏమైనా అమిత్ షా మొత్తానికి హిందీ తేనె తుట్టెను కదిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరో ఉద్యమానికి ఆజ్యం పోశారు. బీజేపీ ఉనికి కోసం పాకులాడుతున్న తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు బీజేపీని, అమిత్ షా వ్యాఖ్యలను ఎక్కడికి తీసుకుపోతాయో వేచి చూడాలి. ఇక కర్ణాటకలో కన్నడిగులు తమ మాతృబాష కన్నడంపై మరో ఉద్యమం లేవదీసినా ఆశర్యపోనవసరం లేదు.