Hyderabad, May 26: తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)గురువారం బెంగళూరు (Bengaluru) వెళ్లనున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోనున్న సీఎం కేసీఆర్ అక్కడ మాజీ ప్రధాని దేవెగౌడ (Devegowda), కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో (Kumara swamy) భేటీ కానున్నారు. కాగా జాతీయ స్థాయిలో బీజేపీ (BJP), కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు యత్నిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అందులో భాగంగా జాతీయ స్థాయి నేతలతో పాటు..పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ నేతలతోనూ విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ, పంజాబ్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్..అక్కడ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తోనూ (Kejriwal), యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) తోనూ..పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోనూ భేటీ అయ్యారు. అయితే ఢిల్లీ పర్యటనను రెండు రోజుల ముందే ముగించుకున్న సీఎం కేసీఆర్..ఉన్నట్టుండి సోమవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం కర్ణాటక పర్యటనను ఖరారు చేసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఇతర అంశాలపైనా నేతలు చర్చించనున్నారు. ఈక్రమంలో సీఎం భద్రతా సిబ్బంది ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.
కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా నగరంలో పలు చోట్ల అభిమానులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన అనంతరం ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను (Anna Hazare) కలిసేందుకు మే 27న రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళ్తారని ముందుగా భావించినా..ఆ పర్యటన ఖరారు కాలేదు. దీంతో సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)..హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈక్రమంలో సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు దూరంగా ఉండేందుకే బెంగళూరు వెళ్తున్నారంటూ తెలంగాణ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన గతకొద్దిరోజుల క్రితమే నిర్ధారణ అయింది. మోదీ పర్యటనలో పాల్గొనడం ఇష్టంలేకనే సీఎం కేసీఆర్ దేశంలో పలు రాష్ట్రాల పర్యటనను పెట్టుకున్నట్లు తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతుంది.ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పలు దఫాలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు. అయితే గత రెండుసార్లు ప్రధాని పర్యటనల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. తాజాగా 26న ప్రధాని పర్యటనలోనూ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. దీంతో ముచ్చటగా మూడోసారి తెలంగాణలో ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నట్లు అవుతుంది. 2020 నవంబర్ 28న ప్రధాని హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ ను సందర్శించారు. ఆ రోజు సీఎం కేసీఆర్ ప్రధాని పర్యటనకు రావాల్సిన అవసరం లేదని పీఎం కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రధానిని కలవలేదని అప్పట్లో టీఆర్‌ఎస్ వివరణ ఇచ్చింది.