Puducherry, February 17: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తన పదవీ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు, ఈ స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమింపబడ్డారు. మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాల మేరకు రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. "కిరణ్ బేడి పుదుచ్చేరి లెఫ్టినెంట్-గవర్నర్ పదవి నుంచి రిలీవ్ చేయబడ్డారు, మరియు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు" అని ప్రకటన విడుదల చేయబడింది.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం తలెత్తిత్తింది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది, అయితే అనూహ్యంగా మంగళవారం సీఎం వి. నారాయణసామి ప్రభుత్వం నుండి పలువురు ఎమ్మెల్వేలు రాజీనామా చేయడంతో ఆయన ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే రాష్ట్రపతి భవన్ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతల నుంచి కిరణ్ భేడీని తొలగించినట్లు ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.
ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గవర్నర్ కిరణ్ బేడీతో విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్యామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని గవర్నర్ పనిచేయనీయడం లేదని, ప్రభుత్వ విధానాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఇటీవల కలిసి గవర్నర్‌కు వ్యతిరేకంగా మెమొరాండం కూడా అందజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తనను బెదిరిస్తుండటంతో తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించలేకపోతున్నామంటూ రాష్ట్రపతికి ఆయన ఫిర్యాదు చేశారు.
పుదుచ్చేరిలో ఈ ఏప్రిల్ - మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం 30 మంది శాసనసభ్యులు గల పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 16 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్షానికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఇంటిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తాజా రాజీనామాలతో అధికార పార్టీ బలం 11కి పడిపోయింది. ఇక, విపక్ష ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్‌ఆర్‌సీ) 7 సీట్లు గెలుచుకోగా, దాని భాగస్వామ్య పార్టీ అన్నాడీఎంకే 4 సీట్లు గెలుచుకుంది. అయితే, లిఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ బీజేపీ నుంచి ముగ్గురిని నామినేట్ చేశారు. వీరికి ఓటింగ్ హక్కులు కూడా ఉన్నాయి. దీంతో 30 మంది సభ్యుల అసెంబ్లీ బలం 33కి చేరింది.