AP Ex CM Chandrababu Naidu's house at Undavalli, Amaravathi, Vijayawada.

Amaravathi, August 16: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు కరకట్ట ఇంటిని గత కొన్ని రోజులుగా రాజకీయాలు, వివాదాలు, వరదలు చుట్టుముడుతున్నాయి.

విజయవాడకు సమీపంలోని ఉండవల్లి ప్రాంతంలో కృష్ణా నదీ తీరాన్ని అనుకొని ఉన్న లింగమనేని గెస్ట్ హౌజ్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. అయితే చంద్రబాబు ఇళ్లు సహా, అక్కడ మరికొన్ని నిర్మాణాలు అక్రమ కట్టడాలేనని జగన్ సర్కార్ గత జూన్ నెలలో నోటీసులు ఇచ్చింది. నదీతీరాన్ని ఆక్రమించి కట్టిన ఆ నివాసాలకు ఎలాంటి అనుమతులు లేవు అని ఆనాడు నోటీసుల్లో పేర్కొన్నారు.

సీన్ కట్ చేస్తే, ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు కృష్ణా నది ఉదృతంగా ప్రవహిస్తుంది. భారీగా వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారెజ్ నిండుకుంది. దీంతో చాలా కాలం తర్వాత ప్రకాశం బ్యారెజ్ గేట్లు ఎత్తడంతో, దిగువ వైపు ఉన్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఏర్పడింది. గెస్ట్ హౌజ్  కింది ఫ్లోర్లలోని సామాగ్రినంతా అక్కడి సిబ్బంది పైన అంతస్థులకు తరలించారు. వరద నీరును ఇసుక బస్తాలు వేసి అడ్డుకుంటున్నారు.

తాజాగా, చంద్రబాబు నివాసం ఉండే ప్రాంతంలో డ్రోన్ కెమరాలు ఎగరడం కలకలం రేపింది.  ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయన సీరియస్ అయ్యారు. హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లను ఎలా ఎగరనిస్తారు? ఇందులో ప్రభుత్వం కుట్రేమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. జిల్లా ఎస్పీ మరియు ఏపీ డీజీపి అయిన గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు ఫోన్ చేసి ఈ వ్యవహారంపై మాట్లాడారు. తను ఉండే నివాసంపై నిఘా పెట్టింది ఎవరు? ఆ డ్రోన్లలో ఏం రికార్డు చేశారు? తన భద్రత అంటే లెక్కలేదా అని నిలదీశారు.

ఇటు టీడీపీ నాయకులు కూడా చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అక్కడే ఆందోళన చేపట్టారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, డ్రోన్లు ఎగరేసి పట్టుబడిన వ్యక్తులు తాము ప్రభుత్వ అధికారుల అనుమతితోనే విజువల్స్ చిత్రీకరించామని వివరణ ఇచ్చుకున్నారు.

వివాదం తీవ్రమవడంతో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. కృష్ణానది వరద ప్రభావం ఎంతమేరకుందో తెలుసుకునేందుకు తామే ఎప్పటికప్పుడు డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ అనుమతులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకే  టీడీపీ నేతలు ఇలాంటి డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇదొక అక్రమ కట్టడం, దీనికి వరదముప్పు ఉంటుంది, ఈ నివాసాన్ని ఖాళీ చేయాలని తాము ఎప్పుడో చెప్పామని మంత్రి పేర్కొన్నారు.  వరదలో తన అక్రమ కట్టడం మునిగిపోయింది అనే విషయం ప్రపంచానికి తెలియకుండా విషయాన్ని డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు  ఈ వ్యవహారాన్ని పెద్దది చేస్తున్నారన్నారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించకుండా టీడీపీ ఇప్పటికైనా డ్రామాలు ఆపితే మంచిదని మంత్రి హితవు పలికారు.