Bhopal, November 10: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు (Madhya Pradesh Bypoll Results 2020) మరో కొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఆ రాష్ర్టంలో అధికారాన్ని డిసైడ్ చేయనున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia) వర్గంలోని 25 మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరి తమ పదవులకు రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెందడంతో.. మొత్తం 28 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీరిలో 12 మంది మంత్రులు ఉన్నారు.
అయితే ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయనేది ఉత్కంఠగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 116. అయితే ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు గెలవడం తప్పనిసరి. లేనిపక్షంలో అధికారం కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం భాతరతీయ జనతా పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 87 మంది సభ్యుల బలం ఉంది.
మొత్తం 19 జిల్లాల్లో ఉన్న 28 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. కరోనా నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసీ సూచనల మేరకు.. కేవలం ఎన్నికల అభ్యర్థులు.. వారి పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే కేంద్రాల వద్ద ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి అమలు చేస్తున్నారు.