Kamal Nath with Jyotiraditya Scindia (Photo Credits: IANS)

Bhopal, March 9: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కారుకి బీజేపీ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ (MP Government Crisis) తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న కమలనాథ్ సర్కారును (Kamal Nath Govt) కూలదోసేందుకు ప్రతిపక్ష బీజేపీ రెడీ అవుతోంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Madhya Pradesh Chief Minister Kamal Nath)  అత్యవసరంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో (Sonia Gandhi) భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో పాటు ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీఎం కమల్‌నాథ్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఏం చేయాలన్న దానిపై సోనియా తనకు మార్గదర్శనం చేశారని, దానిని అమలు చేస్తానని ప్రకటించారు.

సోమవారం మధ్యాహ్నం 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు 6 మంది కేబినెట్ మంత్రులు బెంగళూరుకు చేరుకున్నట్లు సమాచారం. భోపాల్ నుంచి మూడు ప్రత్యేక చార్డెట్ విమానంలో వీరిని జాగ్రత్తగా తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరందరూ కూడా రెబెల్‌ ఎమ్మెల్యేలుగా మారి కమల్‌నాథ్ సర్కారుకు సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది.

Here's ANI Tweet

 

కాగా ఈ మొత్తం వ్యూహానికి కూడా కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియానే (Jyotiraditya Scindia) కారణమని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుగుబాటు జెండా ఎగరవేసిన 18 మందిలో సింధియా వర్గం వారే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. తమ ఎమ్మెల్యేలకు 25 నుంచి 35 కోట్లను ఆఫర్ చేసి, ప్రలోభానికి గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం దీనిని ఖండిస్తూ వస్తోంది.

Here's ANI Tweet

ఈ పరిస్థితులు ఇలా ఉంటే 18 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు మంత్రులు కూడా రెబెల్స్ గా మారడంతో ప్రతిపక్ష బీజేపీ (BJP) సభలో కమల్‌నాథ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Here's ANI Tweet

గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిసాహులాల్ సింగ్ నిన్న తిరిగి భోపాల్ చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలుజా తెలిపారు. బెంగళూరు నుంచి విమానంలో భోపాల్ చేరుకున్న ఎమ్మెల్యే నేరుగా ముఖ్యమంత్రి కమల్‌నాథ్ నివాసానికి వెళ్లి కలిశారు. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తమ ఎమ్మెల్యేలను బీజేపీ కిడ్నాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించిన సంగతి విదితమే.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 109, కాంగ్రెస్‌ 114 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్‌ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ పాఠక్‌ కీలక వ్యాఖ్యలు 

మధ్యప్రదేశ్‌లో అధికార పీఠాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆపరేషన్‌ కమలం కుట్రకు తెరలేపిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సంజయ్‌ పాఠక్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ హెచ్చరికలకు లొంగకపోవడంతోనే బంధవాఘర్‌లో ఉన్న తన రిసార్టును అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా చచ్చే వరకు తాను బీజేపీలో కొనసాగుతానని ఆయన స్సష్టం చేశారు. తనను ఎత్తుకెళ్తేందుకు కాంగ్రెస్‌ వర్గం ప్రయత్నించిందని, తనకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే ట్విటర్‌ వేదికగా చెప్పుకొచ్చారు.

Here's ANI Tweet

కాగా, అక్రమంగా రిసార్టు నిర్మాణం చేశారని పేర్కొంటూ కమల్‌నాథ్‌ ప్రభుత్వం బంధవాఘర్‌లో ఉన్న సంజయ్‌ పాఠక్‌ రిసార్టును శనివారం కూల్చివేసింది. ఇక రిసార్టు కూల్చివేతతో పాటు.. సంజయ్‌ కలిగి ఉన్న ఇనుప ఖనిజం లీజులను కూడా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం రద్దు చేసింది. విజయ్‌రాఘవ్‌ఘర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంజయ్‌ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సంజయ్‌ 2014లో బీజేపీలో చేరారు. 2016లో శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకువస్తే రూ.100 కోట్లు

ఇక వ్యాపమ్‌ స్కామ్‌ను బట్టబయలు చేసిన డాక్టర్‌ ఆనంద్‌రాయ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తమ వైపు తీసుకువస్తే రూ.100 కోట్లు, ఎమ్మెల్యేలకి కొత్త కేబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తామని బీజేపీ నేత నరోత్తమ్‌ మిశ్రా తనతో మాట్లాడారంటూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే అది మార్ఫింగ్‌ వీడియో అని మిశ్రా స్పష్టం చేశారు.

సర్కార్‌కు వచ్చిన ముప్పేమీ లేదు: ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ 

తన సర్కార్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్రజాస్వామికంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నడం దారుణమని ఆయన ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ నాటకాలు ఆడుతోందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి గోవింద్‌ ఆరోపించారు. మార్చి 26న జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలకు విప్‌ జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.