Maharashtra govt LIVE updates bjp-ready-face-floor-assembly-test (Photo-Twitter)

Mumbai, November 26: అనుకోని మలుపులతో సాగుతూ వచ్చిన మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాలకు బీజేపీ శుభం కార్డు వేసింది. రాత్రికి రాత్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభాపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ (Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ మద్దతు ప్రకటించడంతో మహాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శివసేన, కాంగ్రెస్‌ నేతలతో పాటు శరద్‌ పవార్‌కు ఊహించిన షాక్‌ ఇచ్చిన అజిత్‌ పవార్ (NCP's Ajit Pawar) డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.

ఎన్సీపీలోని సగంమంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకుని బీజేపీకి అజిత్ మద్దతు ప్రకటించారు. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన రద్దయింది, అయితే ఇప్పుడు బీజేపీకి అసలైన పరీక్ష ఎదురుకోబోతోంది.

ఈనెల 30లోపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుకోవాలని గవర్నర​ భగత్‌సింగ్‌ కోశ్యారీ (governor Bhagat Singh Koshyari) బీజేపీకి సూచించారు. అయితే ఈ సూచనను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు బట్టింది.  24 గంటల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్ష (Maharashtra Assembly Floor Test) ఆసక్తికరంగా మారింది. ఫడ్నవిస్‌కు ఎన్సీపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపకపోతే బలపరీక్షను ఎదుర్కొవడం సవాలే.

దీంతో ప్రభుత్వాన్ని నెగ్గించుకునేందుకు బీజేపీ, ఫడ్నవిస్‌ను అడ్డకునేందుకు విపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బీజేపీకి మేము మద్దతు ఇవ్వలేదు, అజిత్ పవార్‌ది వ్యక్తిగత నిర్ణయం, అజిత్ నిర్ణయాన్ని మేము స్వాగతించడం లేదు అని తెలిపారు.

కాగా మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ (BJP) 105, శివసేన( Shiv sena) 56, ఎన్సీపీ (NCP) 54, కాంగ్రెస్‌ (Congress) 44 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి 145 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్సీపీలో అజిత్‌ వెంట ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వారంతా తిరిగి శరద్ పవార్ చెంతకే చేరారు. దీంతో అజిత్ పవార్ వర్గం ఇప్పుడు ఎంత అనేది సస్పెన్స్ లో ఉంది.   అజిత్ పవార్‌ది వెన్నుపోటు, మా కళ్లలోకి కళ్లు పెట్టి చూడటానికి భయపడ్డాడు, తప్పు చేసిన వాడిలా తల దించుకున్నాడు 

ఈ పరిణామాలు ఇలా ఉంటే ఎన్సీపీ శాసన సభ్యులంతా తమకు మద్దతు తెలుపుతున్నారని, ఆ పార్టీకి ఇక శరద్‌ పవార్‌ ఒక్కరే మిగిలి ఉన్నారని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక 29 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నాయకత్వం ఇదివరకే పావులు కదిపింది. వారి మద్దతుతో బల పరీక్షలో నెగ్గాలని ప్రణాళిలకు రచిస్తోంది.

బల పరీక్షకు  విపక్షంలోని రెబల్స్‌పైన కూడా బీజేపీ దృష్టి పెట్టింది. అయితే బలపరీక్షలో సరిపడ ఎమ్మెల్యేల మద్దతు లేకపోతే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగులు వేస్తోంది.