Mumbai, November 23: రాత్రికి రాత్రే మారిన మహారాష్ట్ర రాజకీయ తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (NCP's Sharad Pawar) స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ(BJP)కి మద్దతునివ్వడం తన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ’ఈ రోజు ఉదయం ఏడు గంటలకే నాకు ఈ విషయం తెలిసింది. అజిత్ పవార్ ఇలా చేస్తాడని నాకు తెలియదు. నేను త్వరలోనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను. ఉద్ధవ్ ఠాక్రే కూడా మీడియాతో మాట్లాడతారు. అప్పుడే అన్ని విషయాలు వివరంగా చెబుతాను’ అని పేర్కొన్నారు.
అదే విధంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం (Ajit Pawar Supporting BJP) అని, దీంతో ఎన్సీపీకి ఎటువంటి సంబంధం లేదని శరద్ పవార్ ట్వీట్ చేశారు. అజిత్ నిర్ణయాన్ని తాము స్వాగతించడం లేదని పేర్కొన్నారు. ఆయనతో పాటుగా మరో నేత ప్రపుల్ పటేల్ మాట్లాడుతూ బీజేపీతో కలిసి ఎన్సీపీ పార్టీ నడవడమనేది పార్టీ నిర్ణయం కాదని దీనికి అధినేత శరద్ పవార్ మద్దతు లేదని తెలిపారు.
శరద్ పవార్ ట్వీట్
Ajit Pawar's decision to support the BJP to form the Maharashtra Government is his personal decision and not that of the Nationalist Congress Party (NCP).
We place on record that we do not support or endorse this decision of his.
— Sharad Pawar (@PawarSpeaks) November 23, 2019
కాగా మహారాష్ట్రలో అనూహ్యంగా రాజకీయాలు మారిపోయాయి. రాత్రికి రాత్రే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ( Devendra Fadnavis) ప్రమాణ స్వీకారం చేశారు. తెల్లవారుజామున రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ (Ajit Pawar) ప్రమాణ స్వీకారం చేశారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తమ పార్టీ అధినేత శరద్ పవార్ కు నమ్మక ద్రోహం చేసారని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ వ్యవహారం శరద్ పవార్ కు సంబంధం ఉందని తాము భావించటం లేదన్నారు. అజిత్ పవార్ తన చర్యల ద్వారా మహారాష్ట్ర కు అన్యాయం చేసారని దుయ్యబట్టారు.
అజిత్ పవార్ శుక్రవారం వరకు తమతోనే ఉన్నారని..ఫోన్ స్వచ్చాఫ్ చేసారని..తాను తన లాయర్ తో ఉన్నట్లుగా చెప్పారని వివరించారు. శుక్రవారం నుండే అజిత్ పవార్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా కనిపించందని వివరించారు. అయితే, ఈ మొత్తం వ్యవహారం ద్వారా బీజేపీ మహారాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
రెండు రోజుల కింద ప్రధాని మోడీ (PM Modi)తో పవార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధానితో భేటీ సందర్భంగా కేవలం రైతు సమస్యల గురించి మాత్రమే చర్చించామని శరద్ పవార్ ప్రకటించారు. అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రితో భేటీ అయిన పవార్.. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశంలోనే శివసేనకు మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్- ఎన్‌సీపీలు ఓ అవగాహనకు వచ్చాయి. గురువారం రాత్రి ఉద్ధవ్ ఠాక్రేతో ప్రత్యేకంగా సమావేశమైన శరద్ పవార్.. ఆయనను ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాలని సూచించారు.