EC Rajeev kumar (Photo-ANI)

New Delhi, Oct 15: మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ప్రకటించింది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూల్‌ను చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు.

మహారాష్ట్ర (Maharashtra)లో మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడుతుంది. నామినేషన్ల గడవు అక్టోబర్ 29వ తేదీతో ముగుస్తుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 4వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ 25వ తేదీలోగా ఎన్నికలు ముగియాల్సి ఉంటుంది.నవంబర్‌ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ ఆరోపణలపై సీఈసీ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు, ట్యాంపరింగ్‌కు ఎలాంటి అవకాశం లేదని తోసిపుచ్చిన ఈసీ

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు (Jharkhand Assembly Elections) కూడా ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. 81 అసెంబ్లీ స్థానాలకు గానూ రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్‌ 13న ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిని 38 స్థానాలకు నవంబర్‌ 20న ఎన్నికలు ఉంటాయి. ఇక నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. రాష్ట్రంలో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది. ఇక వచ్చే ఏడాది జనవరి 5తో జార్ఖండ్‌ అసెంబ్లీ గడువు ముగియనుంది.

మహారాష్ట్రలో ఒకే దశలో పోలింగ్‌

అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్‌ 29

అక్టోబర్‌ 30న స్క్రూటినీ

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్‌ 4

నవంబర్‌ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

నవంబర్‌ 23న ఫలితాల వెల్లడి

రెండు విడతల్లో జార్ఖండ్‌ ఎన్నికల పోలింగ్‌

తొలి దశ పోలింగ్‌ వివరాలు

అక్టోబర్‌ 18న నోటిఫికేషన్‌

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్‌ 25

అక్టోబర్‌ 28న స్క్రూటినీ

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్‌ 30

నవంబర్‌ 13న పోలింగ్‌

నవంబర్‌ 23న ఫలితాల వెల్లడి

రెండో దశ పోలింగ్‌ వివరాలు

అక్టోబర్‌ 22న నోటిఫికేషన్‌

నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ- అక్టోబర్‌ 29

అక్టోబర్‌ 30న స్క్రూటినీ

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 1

నవంబర్‌ 20న పోలింగ్‌

నవంబర్‌ 23న ఫలితాల వెల్లడి

రాజీవ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హర్యానా, జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఎలాంటి హింస లేకుండా ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని చెప్పారు.