Mumbai, December 31: మహా రాజకీయాల్లో అప్పుడే ముసలం మొదలైంది. క్యాబినెట్ విస్తరణ జరిగిన మరుసటి రొజే నేతల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ రాజీనామాస్త్రం. రాజకీయాలకు తాను పనికిరానంటూ మహారాష్ట్రకు(Maharashtra) చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ (Ncp Mla Prakash Solanki) ప్రకటించడమేకాక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా(Solanki Announces Resignation) చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. బీద్ జిల్లా మజల్ గావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సోలంకీ ఈ విషయాన్ని నిన్న రాత్రి వెల్లడించారు.
మంగళవారం నేను రాజీనామా చేస్తాను. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని నేను ఎన్సీపీ నేతలకు కూడా తెలిపాను. స్పీకర్ ను కలిసి నా రాజీనామా పత్రాన్ని అందిస్తా’ అని చెప్పారు. కాగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Maharashtra Cabinet Expansion)చేపట్టిన కొన్నిగంటలకే సోలంకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
‘మహా’ సర్కారు కీలక నిర్ణయం, రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ
తన రాజీనామా నిర్ణయానికి, కేబినెట్ లో స్థానం దక్కకపోవడానికి ఎలాంటి సంబంధం లేదని సోలంకీ అన్నారు. అయితే.. కేబినెట్ విస్తరణ తాను రాజకీయాలకు అనర్హుడినని నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
రాష్ట్రంలో ఉద్ధవ్ థాకరే సీఎంగా కాంగ్రెస్,శివసేన, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం మంత్రి వర్గ విస్తరణ జరిపారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం మూడు పార్టీలనుంచి 36 మంది మంత్రులు, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
మూడు రోజుల ముచ్చటైన సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, సీఎం పదవికి ఫడ్నవిస్ రాజీనామా
ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ఆదిత్య థాకరే సహా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్(Sanjay raut) గైర్హాజరయ్యారు. తన సోదరుడు, శివసేన ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు కేబినెట్‌లో చోటు కల్పించకపోవడంతో ఆయన అలకబూనారన్న కథనాలు వెలువడ్డాయి. శివసేన నేతృత్వంలో మహారాష్ట్రలో కొత్త సర్కారు కొలువుదీరడంలో సామ్నా పత్రిక సంపాదకుడైన సంజయ్ రౌత్ క్రియాశీలక పాత్ర పోషించారు.
ఉద్దవ్ థాకరే తర్వాత శివసేనలో నెం.2 ఆయనేనన్న ప్రచారం కూడా కూడా ఉంది. దీంతో ఉద్దవ్ కేబినెట్‌లో సునీల్ రౌత్‌కు చోటు తథ్యమని మొదటి నుంచీ ప్రచారం జరిగింది. అయితే ఆదిత్య థాకరేని కేబినెట్‌లో చోటు కల్పించే ఉద్దేశంతో చివరి నిమిషంలో సునీల్ రౌత్‌ను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ముందు ముందు మహా రాజకీయాలు ఏ పరిస్థితుల వైపు వెళతాయో చూడాలి.