Mumbai, June 27: మహారాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకు అనూహ్య మలుపులు (Maharashtra Political Crisis) చోటు చేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని ( Supreme Court Extends Time ) సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలు (Rebel Shiv Sena MLAs) దాఖలుచేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది. జూలై 11న పిటిషన్లను తిరిగి విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హతపై డిప్యూటీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉద్దవ్ ఠాక్రే లాయర్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ను నిర్ణయం తీసుకోనివ్వండి అని కోర్టును కోరారు. అనర్హతపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
శివసేన రెబల్ ఎమ్మెల్ షిండే ఫోటోపై కోడిగుడ్లు విసిరిన కార్యకర్తలు, పోస్టర్‌పై ఇంక్ చల్లి నిరసన
ఈ సందర్భంగా మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే తమకు, తమ కుటుంబాలకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే బాంబే హైకోర్టును ఆశ్రయించలేదని రెబల్ ఎమ్మెల్యేల తరుఫు న్యాయవాది నీరజ్ కా కౌల్ కోర్టుకు తెలిపారు. 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సోమవారం లోగా సమాధానం ఇవ్వాలన్న డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ నోటీసులు, డిప్యూటీ స్పీకర్ అధికారానికి సంబంధించి రెండు పిటిషన్లను రెబల్స్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. తమ బృందంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు కోర్టుకు షిండే తెలిపారు. శివసేనలోని మొత్తం 55 మంది ఎమ్మెల్యేల మద్దతు రెబల్ గ్రూప్‌కే ఉందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని పేర్కొన్నారు.అలాగే తమకు అనర్హత నోటీసులు పంపిన డిప్యూటీ స్పీకర్ అధికారాన్ని షిండే వర్గం సుప్రీంకోర్టులో ప్రశ్నించింది. ఆయన హోదానే అనుమానంగా ఉన్నప్పుడు అనర్హతపై వ్యవహరించే అధికారం డిప్యూటీ స్పీకర్‌కు లేదన్నారు.
‘అసెంబ్లీ సమావేశాలు జరగకపోయినా పర్వాలేదు. అసెంబ్లీ ఎప్పుడు సమావేశమైనా, డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానం మొదటి అంశంగా ఉండాలి’ అని తిరుగుబాటు ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారుల తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు చాలా బాగా విచారించగలదని తెలిపారు. ‘ఇది లీప్-ఫ్రాగింగ్‌ను అనుమతించే సందర్భం కాదు. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదు’ అని అన్నారు.
ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
ఇక అధికారిక బాధ్యతలు విస్మరించిన మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)ను వెనక్కి రావాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ ముంబై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (PIL) దాఖలైంది. షిండే, మరో 38 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతిలోని ఓ హోటల్‌లో బస చేసినట్టు పిటిషనర్ ఆ పిల్‌లో తెలిపారు. సీజీ దీపంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్మిక్‌తో కూడిన బెంచ్ ముందు ఉత్పల్ బాబూరావు చందవార్ తదితరులు తమ న్యాయవాది అసీం సరోద్ ద్వారా ఈ పిటిషన్ వేశారు. పిల్ లిస్టింగ్ విషయాన్ని పరిశీలిస్తామని జస్టిస్ దీపాంకర్ దత్తా అన్నారు.
9 మంది రెబల్స్ మంత్రుల శాఖలు మార్పు
ఈ పరిస్థితులు ఇలా ఉంటే తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. రెబల్స్ గ్రూపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు.
మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు.
శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్‌పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. మరోవైపు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేకు ఏక్‌నాథ్ షిండే ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎస్ కీలక నేతలతో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు.