New Delhi, july 7: కేంద్ర కేబినెట్‌ను ప్రధాని మోదీ భారీగా ప్రక్షాళన చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ తన క్యాబినెట్‌ను విస్తరించినట్లు (Modi Cabinet Expansion) తెలుస్తోంది. ఈ విస్తరణలో భాగంగా ఏడుగురు సీనియర్ మంత్రులకు ఉద్వాసన (7 Cabinet Ministers Sacked) పలికారు. వారిలో హై ప్రొఫైల్ మంత్రులు నలుగురు ఉన్నారు. కొత్తగా 36 మంది మోదీ క్యాబినెట్‌లో (Prime Minister Narendra Modi's mega cabinet) మంత్రులుగా చేరారు.
కరోనా రెండో వేవ్‌ను ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ విఫలమైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన క్యాబినెట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్లు తెలుస్తోంది. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో కలిసి మొత్తం మోదీ క్యాబినెట్‌లో 77 మంది మంత్రులు ఉన్నారు. వారిలో దాదాపు సగం కొత్త ముఖాలే కావడం గమనార్హం. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఆయా రాష్ట్రాలకు ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చినట్లు కూర్పును బట్టి తెలుస్తోంది. అందరూ ఊహించినట్లే రికార్డు స్థాయిలో 43 మందికి కొత్తగా అవకాశం (43 Ministers Take Oath) ఇచ్చారు. కాగా ప్రధాని మోదీ రెండో సారి అధికారంలో వచ్చాక చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇదే.
కేంద్ర మంత్రి వర్గ పునర్వవస్థీకరణకు మార్గం సుగమం చేస్తూ 12 మంది కేంద్ర మంత్రులు చేసిన రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సాయంత్రం ఆమోదించారు. రాజీనామాలు చేసిన మంత్రుల్లో డీవీ సదానంద గౌడ, రవి శంకర్ ప్రసాద్, థావర్ చంద్ గెహ్లాట్, రమేష్ పోఖ్రియాల్ నిషాంక్, డాక్టర్ హర్ష వర్ధన్, ప్రకాశ్ జవదేకర్, సంతోష్ కుమార్ గంగ్వార్, బాబుల్ సుప్రియో, థోత్రె సంజయ్ శామ్‌రావు, రత్తన్ లాల్ కటారియా, ప్రతాప్ చంద్ర సారంగి, దేబశ్రీ చతుర్వేది ఉన్నారు.
భారీగా కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు చేసినా కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజీనామా చేశారు. నూతన మంత్రుల ప్రమాణం కంటే వీరి రాజీనామాలే ప్రధాన చర్చగా మారాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా హర్షవర్దన్.. కరోనా రెండో వేవ్‌ను నియంత్రించడంలో విఫలం అయ్యారని ఆరోపణలు వచ్చాయి.
ఆరోగ్య రంగ మౌలిక వసతుల లేమి, ఆక్సిజన్ లేక వివిధ నగరాల్లోని ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆయన్ని తప్పించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కోవిడ్-19తో మరణించిన వారికి శ్మశాన వాటికలో దహనం, నదుల్లో శవాలు పోటెత్తడంతో అసాధారణ జాతీయ సంక్షోభానికి దారి తీసింది. ఈ పరిణామాలు హర్ష వర్దన్ రాజీనామాకు దారి తీశాయని సమాచారం.
కేంద్ర పర్యావరణశాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్.. మరోవైపు క్యాబినెట్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ వచ్చారు. రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వ ట్రబుల్ షూటర్ల కోర్ టీంలో చేర్చుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్‌లు ఇంతకుముందు ఏబీ వాజపేయి క్యాబినెట్‌లో మంత్రులుగా పని చేసిన వారే.
కొత్త ఐటీ రూల్స్ అమలు విషయంలో సోషల్ మీడియా సంస్థలతో రవిశంకర్ ప్రసాద్ చట్టపరంగా ఘర్షణకు దిగారు. ఇక ట్విట్టర్‌తో రవిశంకర్ ప్రసాద్ నిరంతరం వివాదంలో చిక్కుకున్నారు. రవిశంకర్ ప్రసాద్, జవదేకర్, హర్షవర్దన్ బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. 20 శాతం మంది మంత్రులను పనితీరు ఆధారంగా తొలగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
హర్షవర్థన్ రాజీనామా చేయడం..కొత్తగా నలుగురు డాక్టర్లు కేబినెట్‌లో చేరడంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న డాక్టర్లైన మంత్రుల సంఖ్య ఆరుకు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖను వీరిలో ఎవరికి అప్పగిస్తారనేది ఆక్తికరంగా మారింది. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎంపీ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన పిల్లల డాక్టర్ భగవత్ కరాద్, పశ్చిమ బెంగాల్ బంకురా ఎంపీ, గైనకాలజిస్ట్ డాక్టర్ సుభాస్ సర్కార్, గుజరాత్ సురేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ మహేంద్ర ముంజపారా బుధవారం కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
మరోవైపు మంత్రివర్గ విస్తరణతో కేబినెట్‌లో ఉన్న న్యాయవాద మంత్రుల సంఖ్య 13కు, ఇంజినీర్ల సంఖ్య 5కు, సివిల్ సర్వీసెస్‌కు చెందిన వారి సంఖ్య ఏడుకు పెరిగింది. ఏడుగురు మహిళా ఎంపీలకు కూడా తాజాగా కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఇక అనురాగ్ సింగ్ ఠాకూర్, హర్దీప్ సింగ్ పూరీతోపాటు 15 మంది నూతన క్యాబినెట్ మంత్రులుగా పని చేశారు. అనురాగ్ సింగ్ ఠాకూర్.. ఇంతకుముందు ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. త్వరలో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్‌కు ప్రమోషన్ కల్పించారు.
ఇప్పటి వరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించిన హర్దీప్ సింగ్ పూరీకి ప్రమోషన్ కల్పించారు. ఈ శాఖ పనితీరులో మెరుగ్గా వ్యవహరించినందుకు ఆయనకు పదోన్నతి లభించింది. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం మరో కారణంగా తెలుస్తోంది. ఇంకా కొత్త క్యాబినెట్ మంత్రులుగా శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, నారాయణ రాణె, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్ కూడా ప్రమాణం చేశారు.
మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు
కేంద్ర కెబినెట్ విస్తరణ నేపథ్యంలో దాదాపు డజను మంది కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఇంత పెద్ద సంఖ్యలో కేంద్ర మంత్రులను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదని మమత వ్యాఖ్యానించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను తప్పించడంపై కూడా మమత స్పందించారు. ‘‘కేంద్రానికి పరిపాలనపై శ్రద్ధ ఉందని మీరనుకుంటున్నారా? అన్ని నిర్ణయాలూ మోదీయే తీసుకుంటారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను బలిపశువు చేశారు. నిజంగా వారికి పరిపాలన మీద శ్రద్ధే ఉంటే.. సెకండ్ వేవ్ వచ్చేదే కాదు. ఉన్నట్టుండి బబూల్ సుప్రియో, దేవశ్రీ అసమర్థులయ్యారా?’’ అంటూ మమత మండిపడ్డారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కూర్పు : కాంగ్రెస్
కేంద్ర కెబినెట్‌లో చోటు దక్కబోయే మంత్రుల జాబితా విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ‘‘చాలా మంది దళితులను, వెనుకబడిన తరగతులకు చెందిన వారిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ కూర్పు చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ కూర్పు. ఆయా సామాజిక వర్గాల బాగు కోసమేమీ కాదు. ఇలా చేయడం మోదీకి అత్యావశ్యకం. అందుకే దళితులను, వెనుకబడిన వర్గాల వారికి చోటు కల్పించారు’’ అంటూ ఖర్గే విమర్శించారు.
మంత్రి పదవికి రాజీనామా చేయమన్నారు : బాబుల్ సుప్రియో
కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమన్నారని, తాను చాలా బాధపడ్డానునని బాబుల్ సుప్రియో ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అవినీతి మరక లేకుండా బయటకు వెళ్తునందుకు చాలా సంతోషంగా ఉన్నదని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు పర్యావరణ శాఖ సహాయ మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియో బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.
.