Lucknow, April 24: లఖింపూర్ ఖేరీ కేసులో (Lakhimpur Kheri) ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ( Ajay Mishra) అలియాస్ తేని కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra) లొంగిపోయారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు (bail) చేసిన క్రమంలో.. ఆయన ఆదివారం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) హింసాకాండలో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లొంగిపోవడానికి వారం రోజుల గడువు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ గడువు ముగియడానికి ఒకరోజు ముందు ఆయన కోర్టులో లొంగిపోయారు.
2022, ఫిబ్రవరిలో అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) అతనికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ.. రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. విచారణలో సమయంలో బాధితుల హక్కును నిరాకరించబడిందని.. అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) అధికార పరిధిని మించిపోయిందని సుప్రీంకోర్టు (Supreme Court) త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పుపై కిసాన్ మోర్చా (SKM) స్పందించింది. న్యాయవ్యవస్థపై ఉన్న ఆశను పునరుద్ధరింప చేసిందని, అజయ్ మిశ్రాను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని SKM డిమాండ్ చేసింది.
ఇక లఖింపూర్ ఖేరీ (Lakhimpur Kheri) విషయానికి వస్తే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. లఖింపూర్ ఖేరీ జిల్లాలో కూడా రైతుల బృందం 2021, అక్టోబర్ 03వ తేదీన నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళుతున్న రైతులపైకి అజయ్ మిశ్రాకు (Ajay Misra) చెందిన ఒక SUV దూసుకెళ్లింది. నలుగురు చనిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అనంతరం చెలరేగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని రైతులు ఆరోపించారు.
అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ లను నియమించింది. యోగి ఆదిత్య నాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సిట్ ను కూడా నియమించింది. ఇందులో ముగ్గురు IPS అధికారులున్నారు. అయితే.. దర్యాప్తు, ఛార్జీషీట్ దాఖలు చేసిన అనంతరం అలహాబాద్ హైకోర్టు.. లక్నో బెంచ్ 2022, ఫిబ్రవరి 10వ తేదీన బెయిల్ మంజూరు చేయడం వివాదానికి దారి తీసింది. మొత్తంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆశిష్ మిశ్రా లొంగిపోయారు.