Mumbai, November 15: మహారాష్ట్ర (Maharashtra) లో మధ్యంతర ఎన్నికలు (Mid-term elections) వచ్చే అవకాశం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) స్పష్టం చేశారు. త్వరలోనే శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ (Shiv Sena- NCP- Congress) పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని శుక్రవారం ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు.
అంతేకాదు, తాము ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండదని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలువనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా మూడు పార్టీలు కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు శరద్ పవార్ వివరించారు. బీజేపీతో తమ పార్టీ టచ్ లో ఉందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. కేవలం శివసేన మరియు కాంగ్రెస్ పార్టీలతోనే ఎన్సీపీ చర్చలు జరుపుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలు కలిసి ఉమ్మడి విధానంతో ముందుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం 6 నెలలకు మించి కొనసాగదని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖలను శరద్ పవార్ తిప్పికొట్టారు.
"నాకు ఫడ్నవీస్ చాలా సంవత్సరాలుగా తెలుసు, అయితే ఆయనకు జ్యోతిశ్యం కూడా తెలుసు అనే విషయం నాకు ఇప్పటివరకు తెలీదు" అంటూ పవార్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఎవరి బలమెంత? ఎవరికెన్ని సీట్లు వచ్చాయి? రాష్ట్రపతి పాలనకు దారితీసిన అంశాలేంటి?
అయితే , శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పక్షంలో శివసేన - హిందుత్వ భావజాలమే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా? అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినపుడు, ఎన్సీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ కూడా కేవలం ఒక మతానికో లేదా ఒక వర్గానికో మద్ధతుగా నిలువదు. తమది ఎప్పుడూ సెక్యులరిజమే, కాబట్టి ఇక ముందు తమ ప్రభుత్వం కూడా సెక్యులరిజానికే కట్టుబడి ఉంటుందని శరద్ పవార్ సమాధానమిచ్చారు. తమ మూడు పార్టీలు కలిసి అన్ని అంశాల పట్ల చర్చలు జరిపిన తర్వాతనే ఒక ఉమ్మడి విధానంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని పవార్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనలో అమలులో ఉన్న విషయం తెలిసిందే. నిర్ణీత గడువులోపు ఏ పార్టీ అధికార ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. దీంతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) నవంబర్ 12న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.