New Delhi, March 17: సిఎఎ, ఎన్ఆర్సీ మరియు ఎన్పీఆర్ లను (CAA, NRC & NPR) వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానాలను (Telangana Assembly Resolution) ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, లోకసభ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక దేశ ద్రోహ చర్యగా సంజయ్ అభివర్ణించారు. ప్రజాసంక్షేమం గురించి ఆలోచనలు, చట్టాలు చేయాల్సిన అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తన సొంత ఎజెండా కోసం ఉపయోగించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల వరకు సైలైంట్ గా ఉన్న కేసీఆర్, అవి అయిపోగానే సిఎఎ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు ముందే తీసుకుంటే వారి పార్టీ గెలవదు అని కేసీఆర్ కు ముందే తెలుసు అని బండి సంజయ్ విమర్శించారు.
పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లు భారతదేశంలో అమలు కావాల్సిందే, ఏ అధికారంతో కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో వ్యతిరేక నిర్ణయం తీసుకుంటారు. సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో పాస్ చేయించుకున్న తీర్మానం చెత్తబుట్టలో వేసుకోవాల్సిందే, ఆ తీర్మానాలు ఎందుకు పనికి రావు అని సంజయ్ ధ్వజమెత్తారు. కేవలం ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టేందుకే కేసీఆర్ ఇలాంటి చర్యలు చేపడుతున్నారు. సిఎఎ, ఎన్ఆర్సీ మరియు ఎన్పీఆర్ ల వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు అని సంజయ్ పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం, 'చించేసిన' రాజాసింగ్
తనకు బర్త్ సర్టిఫికేట్ లేదని కేసీఆర్ అంటారు, ఏవీ లేకుండానే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారా? ఎన్నికల సంఘానికి ఏవైతే ధృవీకరణ పత్రాలు సమర్పిస్తారో అవే ఆధారాలు చూపించండి. కేసీఆర్ అయినా, ఓవైసీ అయినా ఎన్పీఆర్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందే లేదంటే శరణార్థులుగా పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో రైతులు, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినపుడు పట్టించుకోని కేసీఆర్ కు, దేశం గురించి ఆలోచించేంత సమయం ఎక్కడిదని ప్రశ్నించారు. దిల్లీ అల్లర్ల గురించి కేసీఆర్ మాట్లాడేముందు, రాష్ట్రంలో జరిగిన భైంసా అల్లర్ల గురించి ఎందుకు మాట్లాడలేదని సంజయ్ నిలదీశారు.
సిఎఎ వ్యతిరేకించడం అంటే వాస్తవాలు తెలుసుకోకుండానే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విధ్వంసకారులకు దేశంలో చోటు కల్పించదల్చుకుంటున్నారా? కేసీఆర్ స్పష్టం చేయాల్సిందేనని సంజయ్ డిమాండ్ చేశారు. సిఎఎ, ఎన్పీఆర్ అమలు జరిపి తీరుతామని టీఎస్ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు.