New Delhi, December 5: ఐఎన్ఎక్స్ మీడియా (INX Media) కేసులో నిన్న బెయిల్ పై విడుదలైన కాంగ్రెస్ సీనియన్ నేత, రాజ్యసభ ఎంపీ పి చిదంబరం (P. Chidambaram) గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందు అక్కడున్న మీడియాతో మాట్లాడిన ఆయన, పార్లమెంటులో తన గళాన్ని ఎవరు అణిచివేయలేరని చెప్పారు. అనంతరం ఉల్లి ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు.
తీహార్ సెంట్రల్ జైలులో 106 రోజులు జైలు జీవితం తర్వాత బయట ప్రపంచానికి వచ్చిన చిదంబరం ఈరోజు తన మొదటి విలేకరుల సమావేశం (Press Meet)లో దేశ ఆర్థిక స్థితిగతులపై మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక తిరోగమనంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) "అసాధారణ మౌనాన్ని" ప్రదర్శిస్తున్నారని చిదంబరం వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వం తప్పులు చేయడం లేదు అని చెప్పడం కాదు, అసలు ఈ ప్రభుత్వమే తప్పుడు ప్రభుత్వం. మోదీ తన మంత్రులను మోసాలు చేసేందుకు, తిరిగి గట్టిగా అరిచేందుకు స్వేచ్ఛ కల్పించారు, దాని నికర ఫలితమే నేటి భారత ఎకానమీ అని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ప్రభుత్వం 'అసమర్థ నిర్వాహాకుడు' గా మారిపోయిందని ఈ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎద్దేవా చేశారు.
పరిస్థితులు ఇంత దిగజారడానికి అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయోనని కేంద్రం పసిగట్టలేకపోయింది. దానికి తమ అసమర్థమైన నిర్ణయాలకు సమర్థన చేసుకుంటూ కేంద్ర మంత్రులు మొండిగా వాదిస్తారు. డీమానిటైజేషన్, టాక్సులు, పారిశ్రామిక విధానం, విదేశీ దిగుమతులపై ఆంక్షలు, కేంద్రీకృత నియంత్రణ లాంటి ఎన్నో అంశాలలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని చిదంబరం విమర్శించారు.
మోదీ ప్రభుత్వం ద్వారా వృద్ధి రేటు యొక్క ప్రతి సంఖ్య పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ దిశలో చూపబడింది. "8, 7, 6.6, 5.8, 5 మరియు 4.5" గత ఆరు త్రైమాసికాలలో జిడిపి యొక్క వృద్ధి రేట్లు ఇవి, ఇంతకన్నా దారుణంగా పతనం ఇంకా ఎక్కడా జరగదు. ఇప్పటికైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధిరేటు కలిగి ఉంటే దేశ ప్రజలు అదృష్టవంతులేనని, అయితే అనుమానంతో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన దాని కంటే 1.5 శాతం తక్కువే జీడీపీ వృద్ధి రేటు ఉండొచ్చని చిదంబరం తెలిపారు. మెరుగైన ఆర్థిక సంస్కరణల ద్వారా ఆర్థిక మందగమనం (economic slowdown) నుండి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చు, కానీ ఈ ప్రభుత్వం అలాంటి చర్యలేవి తీసుకోలేని అసమర్థమైన ప్రభుత్వం అని విమర్శించారు.