బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రెండు విడతల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాలు ఏప్రిల్ 6న ముగియనున్నాయని తెలిపారు. తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామం ఉంటుందన్నారు. రెండో విడతలో మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6తో ముగియనున్నట్లు పేర్కొన్నారు.
66 రోజుల వ్యవధిలో మొత్తం 27 రోజల పని దినాల్లో ఈ సమావేశాలు కొనసాగున్నట్లు తెలిపారు. ఈ కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.