New Delh,Sep 13: రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం (Parliament Monsoon Session Begins Tomorrow) కానున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు, జాగ్రత్తల నడుమ..ఎన్నడూ చోటు చేసుకోని విధంగా అనేక ప్రత్యేకతల మధ్య ఈ సమావేశాలు (Parliament Monsoon Session) జరగనున్నాయి. ఈ సమావేశాలకు ముందు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించట్లేదు. మొట్టమొదటి సారి భారత్‌లో రియల్ టైమ్‌లో ఉభయసభలు సమావేశం కానున్నాయి.
రేపటి నుంచి ఉదయం 11 గంటలకు రాజ్యసభ, మధ్యాహ్నం 2 గంటల నుంచి లోక్‌సభ సమావేశాలు (Lok Sabha) జరుగుతాయి. ఉభయ సభలకు హాజరయ్యే ప్రతి సభ్యుడు కరోనా పరీక్షలు (Coronavirus Test) చేయించుకోవాల్సిందే. ఈ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారికే పార్లమెంట్ ప్రాంగణంలోకి అనుమతి ఉంటుంది. పార్లమెంటు సభ్యులందరికీ ముందు జాగ్రత్తగా కిట్లు సరఫరా చేశారు.
ఇప్పటికే రాజ్యసభ ఛైర్మన్, లోక్‌సభ స్పీకర్ పార్లమెంటు సిబ్బందితో కలిసి మాక్ సమావేశాలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం వెంకయ్య నాయుడు రాజ్యసభ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు కొందరు సభలో, మరి కొందరు నాలుగు పబ్లిక్ గ్యాలరీల్లో, లోక్‌సభ మందిరంలో కూర్చోనున్నారు. శాంపిల్ ఓటింగ్ ప్రక్రియను కూడా చేపట్టారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం బీఏసీ (పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం 11 గంటలకు జరిగింది. అనేక అంశాల్లో అధికారపక్షాన్ని నిలదీయాలని విపక్షాలు సిద్ధమవుతుండగా.. విపక్ష దూకుడును నిలువరించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. మరోవైపు సోనియా, రాహుల్ గాంధీ కొన్ని రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశముంది.