New Delhi, January 29: జనతాదల్ (యునైటెడ్) (JD-U) పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడటమే కాకుండా, ఏకంగా పార్టీ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తుండటంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ జేడీయూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రశాంత్ (Prashant Kishor ) తో పాటు జేడీయూ ప్రధాన కార్యదర్శి పవన్ వర్మపై కూడా బహిష్కరణ (Expulsion) వేటు పడింది. వీరిద్దరి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ జేడీయూ చీఫ్ జనరల్ సెక్రెటరీ ప్రకటన విడుదల చేశారు.
రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ 2018లో జేడీయూలో చేరి, పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే గత కొంతకాలంగా ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు జాతీయ పౌర జాబితా (NRC) ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సిఎఎకు మద్ధతు, మరియు బిహార్ వెలుపల బీజేపీతో జేడీయూ పొత్తు పట్ల సీఎం నితీష్ కుమార్‌ను గట్టిగా ప్రశ్నించారు.
అంతేకాకుండా పార్టీలో ఉంటూనే సీఎం నితీష్ (Nitish Kumar) పై బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఇటీవల తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో పాటు సిఎఎ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మద్ధతుగా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తుండటంతో ప్రశాంత్, నితీశ్ ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్. వెస్ట్ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహకర్తగా పనిచేసేందుకు ఇప్పటికే అంగీకరించారు. దీంతో ఇక ఉపేక్షించని జేడియూ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
ఇక జేడీయూ నుంచి తొలగించినందుకు గానూ ప్రశాంత్ కిషోర్ ధన్యవాదాలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ
"ధన్యవాదాలు నితీశ్ కుమార్, మీకు నా శుభాభినందనలు, మీరు బీహార్ సీఎం కూర్చీ నెలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను. మీపై ఆ దేవుడి కృప ఉండాలి" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
Prashant Kishor's Tweet on His Expulsion From JD(U):
Thank you @NitishKumar. My best wishes to you to retain the chair of Chief Minister of Bihar. God bless you.🙏🏼
— Prashant Kishor (@PrashantKishor) January 29, 2020
అంతటితో ఆగకుండా అమిత్ షా ఆదేశాలతో తనను పార్టీలో చేర్చుకున్నారని అబద్దాలు చెప్పడం ద్వారా మీ అసలు రంగును నాపై రుద్దే ప్రయత్నం చేశారు. సిఎఎకు అనుకూలంగా ఓటు వేయడం పట్ల నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. పనిలో పనిగా అమిత్ షాపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యహరించి జగన్ గెలవడంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.