Prashant Kishor (Photo Credits: IANS)

Patna, January 28: బీహార్ రాజకీయాల్లో (Bihar Politics)అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జేడీయూ అధ్యక్షుడు, సీఎం నితీష్‌ కుమార్‌, (Nitish Kumar) ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు (Prashant Kishor) మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రశాంత్‌ కిషోర్‌పై సీఎం నితీష్‌ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉంటే ఓకే...వెళ్లిపోయినా కూడా ఓకే. ఎవరైనా ఇష్టమున్నంతకాలం పార్టీలో ఉండవచ్చు. పార్టీ వదిలివెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు. మాది వేరే రకమైన పార్టీ. అతను అసలు పార్టీలో ఎలా చేరాడో తెలుసా? ప్రశాంత్ ను పార్టీలో చేర్చుకోమని అమిత్ షా (Amit shah) నాకు చెప్పాడు. అతని మనసులో ఏదో ఉండిఉండవచ్చు. అది పార్టీ వదిలిపోవాలనుకోవడం కావచ్చు.

అయితే దీనిపై వెంటనే స్పందించిన ప్రశాంత్‌ కిషోర్‌.. తాను బిహార్‌ వచ్చి సమాధానం చెబుతానని, కొంత సమయం వరకు వేచి చూడాలని సమాధానమిచ్చారు. దీంతో పాటుగా బీహార్ సిఎంను లక్ష్యంగా చేసుకుని కిషోర్ చేసిన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ ద్వారా నితీష్ కుమార్ మీద విరుచుకుపడ్డారు.

Prashant Kishor's Tweet:

మీరు నన్ను పార్టీలో చేర్చుకోవడం అమిత్ షా ద్వారా జరిగిందని అబద్దాలు చెబుతున్నారు. మీ రంగును నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెబుతున్నది నిజమని ఎవరూ నమ్మరు. మీకు ధైర్యం లేదని అమిత్ షా చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని ట్విట్టర్లో తెలిపారు.

కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద చట్టాలను (CAA) ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నితీష్‌ కుమార్‌ ప్రస్తుతం ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ.. బీజేపీ వ్యతిరేక పక్షాలకు మద్దతుగా ప్రశాంత్‌ వ్యవహరిస్తున్నారు. ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు.

ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ పొత్తును విమర్శించిన జేడీయూ నాయకుడు పవన్ వర్మ (Pawan Varma) తీరును నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. తనతో వ్యక్తిగత సంభాషణలను బాహాటంగా వెల్లడించిన పవన్‌కు తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తూ, ఆయన పార్టీ మారాలనుకుంటే, వెళ్ళిపోవచ్చునని చెప్పారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడాన్ని బట్టి చూస్తుంటే వాళ్లని పొమ్మనక పొగబెట్టినట్లు కన్పిస్తోంది.

ఢిల్లీ ప్రచార సభలో ఆప్ మీద నిప్పులు చెరిగిన అమిత్ షా

ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్.. వెస్ట్ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యూహకర్తగా పనిచేసేందుకు ఇప్పటికే అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే.

మరోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమించారని వారిని అభినందిస్తూ ఇటీవల ఆయన ట్వీట్‌ కూడా చేశారు.

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. షాహీన్‌బాగ్‌ ఘటనపై ఇద్దరూ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సందించుకున్నారు.

ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం ప్రశాంత్‌ వ్యవహారంగా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కంట్రోల్‌లో పెట్టాలని నితీష్‌ను బీజేపీ పెద్దలు మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ కిషోర్‌ వ్యవహారంపై నితీష్‌ బహిరంగ వ్యాఖ్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.