Prashant Kishor (Photo Credits: IANS)

New Delhi, December 15: ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఈ పేరు రాజకీయాల్లో తెలియని వారు ఉండరేమో.. 2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రచార వ్యూహకర్తగా వ్యవహరించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. మోడీ ప్రచారం కోసం అనేక వ్యూహాలు రచించి బీజేపీ(BJP) పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బీహార్ (Bihar) ఎన్నికల్లో జెడియుకు పనిచేశారు. అక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పంజాబ్ (Punjab)లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) తరపున ప్రచారం నిర్ణయించారు. ఏపీలో జగన్ (YS Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాగా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2020)అరవింద్ కేజ్రీవాల్ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రశాంత్ కిశోర్ తో కలిసి పనిచేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో ఆసక్తి పెరిగింది.

Arvind Kejriwal Tweet:

వచ్చే ఏడాది ఢిల్లి శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఐ-పాక్‌ కన్సల్టెన్సీ సర్వీసులకు చెందిన ప్రశాంత్‌ కిషోర్‌ తమతో కలిసి పని చేయనున్నారని ఆప్‌ అధినేత, ఢిల్లి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ప్రశాంత్‌ కిషోర్‌కు కేజ్రీవాల్‌ స్వాగతం పలికారు. ఈ విషయాన్ని ఐపాక్‌ కూడా తన ట్వీట్‌ ద్వారా ధృవీకరించింది. పంజాబ్‌ ఎన్నికల తరువాత గట్టి పోటీదారుగా ఆప్‌ను గుర్తించామని, ఈ నేపథ్యంలో ఆప్‌తో కలిసి పనిచేయనుండడం సంతోషకరమని ఐపాక్‌ పేర్కొంది.

I-PAC Tweet

వివాదాస్పదమైన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రశాంత్‌ కిషోర్‌ వ్యతిరేకించారు. అలాగే ఐపాక్‌ తాజా క్లయింట్లు, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారే కావడం ఆసక్తికరమైన విషయం.

మరోవైపు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాగా వేసి, ఢిల్లీలో కూడా అధికార పగ్గాలకోసం ఉవ్విరూళుతున్న బీజేపీ ఏ వ్యూహాలు రచిస్తుందో చూడాలి. దీంతో పాటు ఎన్నికల వ్యూహకర్తగా తనదైన శైలిలో రాణిస్తూ ఆయా పార్టీలకు అధికారాన్ని సునాయాసంగా అందిస్తున్న పీకే వ్యూహాలు అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఏమేరకు కలిసి వస్తాయో వేచి చూడాలి.

కాగా 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు తృణమూల్ కాంగ్రెస్‌కు కూడా ప్రశాంత్‌ కిషోర్‌ ఐపాక్‌ పనిచేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి విజయం సాధించాలనే లక్ష్యంతో దీదీ మమతా బెనర్జీ కూడా పీకేను నమ్ముకున్న సంగతి తెలిసిందే.