New Delhi, December 24: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో , రైతులు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా దిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ చేపట్టింది. నూతన చట్టాలకు వ్యతిరేకంగా 2 కోట్ల సంతకాలతో కూడిన మెమోరాండంను రాష్ట్రపతికి సమర్పించడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం ఉదయం పాదయాత్రగా రాష్ట్రపతి భవన్‌కు వెళుతుండగా దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి ఉన్నవారిని మాత్రమే రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లనిస్తామని పోలీసులు చెప్పడంతో ప్రియాంక గాంధీ తదితరులు అక్కడే కూర్చొని ధర్నాకు దిగారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు ప్రియాంక గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నాయకులను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకుంది.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ "మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము, పోలీసులు అడ్డుకున్నది ప్రజలచే ఎన్నుకోబడిన ఎంపీలను. రాష్ట్రపతిని కలిసే వారికి హక్కు ఉంది, వారిని అనుమతించడంలో పోలీసులకు ఉన్న సమస్య ఏమిటి? సరిహద్దుల్లో క్యాంప్ చేస్తున్న లక్షలాది మంది రైతుల గొంతులను వినడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు". అని పేర్కొన్నారు.
"ఈ రోజు కాంగ్రెస్ పాదయాత్రకు ఎటువంటి అనుమతి ఇవ్వబడలేదు. కొవిడ్ -19 కారణంగా దిల్లీ ప్రాంతంలో సెక్షన్ 144 విధించామని, సమావేశాలకు అనుమతి లేదని దిల్లీ నగర అదనపు డిసిపి తెలిపారు. అయితే, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కలిగిన ముగ్గురు నాయకులకు మాత్రం రాష్ట్రపతి భవన్ వెళ్లేందుకు అనుమతినిచ్చాం" అని అదనపు డిసిపి స్పష్టం చేశారు.
Watch Rahul Gandhi's Comments:
#WATCH | There is no democracy in India. It can be in your imagination, but not in reality: Congress leader Rahul Gandhi on Delhi Police taking party leaders into custody during their march to Rashtrapati Bhavan pic.twitter.com/7oYfUDEkEM
— ANI (@ANI) December 24, 2020
కాగా, అపాయింట్‌మెంట్ కలిగి ఉన్న, రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం మరియు 2 కోట్ల సంతకాల మెమొరాండం సమర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు రైతులు దిల్లీ సరిహద్దుల నుండి కదలరని చెప్పారు.
ప్రతిపక్షాలు రైతులతోనే ఉన్నాయి. చట్టాలు రద్దు అయ్యే వరకు నిరసన తెలిపే రైతులను ఎవరూ ఆపలేరు ఆయన పేర్కొన్నారు. ఈ సత్యాగ్రహంలో దేశానికి అన్నంపెట్టే అన్నదాతకు అందరూ మద్ధతుగా నిలవాలని రాహుల్ గాంధీ కోరారు.