పంజాబ్‌లో ఇతర పార్టీలను ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. వన్‌మ్యాన్ షో ప్రదర్శించింది. ఆమ్‌ఆద్మీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 59 కంటే ఎక్కువ స్థానాల్లో (Punjab Election Results 2022) ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజా రిపోర్ట్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్‌లో.. 89 స్థానాల్లో ఆప్ లీడింగ్‌లో (The Rise of Aam Aadmi Party in Punjab) ఉంది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించిన మ్యానిఫెస్టోకు, హామీలకు ప్రజలు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ‘ఎక్ మౌకా కేజ్రీవాల్.. ఎక్ మౌకా భగవంత్ మన్’ను పంజాబ్ ప్రజలు విపరీతంగా ఆదరించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భాగంగా.. పంజాబ్ ఫలితాలు (Punjab Assembly Elections 2022) హేమాహేమీలకు షాక్ ఇచ్చాయి. అధికార కాంగ్రెస్, ప్రాంతీయ ఆదరణ ఉన్న శిరోమణి అకాళీ దళ్, మరో జాతీయ పార్టీ బీజేపీలకు కామన్‌గా షాక్ ఇచ్చింది ఆప్. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా.. పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 59. అయితే ఇప్పటికే ఆప్ ఆ ఫిగర్‌ను దాటేసింది. ఫోన్ కాల్ స్పందన ద్వారా ఎంపిక చేసిన సీఎం అభ్యర్థి భగవంత్ భగవంత్ మాన్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఈ ఫలితాల్లో పంజాబ్ ఆప్ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
పంజాబ్ సీఎం చన్నీ, సిద్దూ ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్నారు. అయితే పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో గత రెండేళ్ల నుంచి జరుగుతన్న పరిణామాలను ఆ పార్టీని కుదేలు చేసేశాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు పంజాబ్‌లో అతి ఘోరమైన ఓటమి ఎదురుకానున్నది. మాజీ సీఎం అమరీందర్, సిద్దూ మధ్య జరిగిన ఆధిపత్య పోరు ఆ పార్టీని నిలువునా ముంచేసింది. ఎన్నికలకు ముందే అమరీందర్ కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ, అమరీందర్ కూటమి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. రైతుల ఆందోళనలు బీజేపీకి పంజాబ్‌లో మైనస్ అయ్యాయి.
తాజా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ సింగ్ పోటీ చేశారు. దురి నియోజకవర్గం నుంచి ఆయన ఆధిక్యంలో ఉన్నారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసిన సీఎం చన్నీ.. ఓ స్థానం నుంచి వెనుకంజలో ఉన్నారు. ఆప్ క్లీన్ స్వీప్ దిశగా వెళ్తోంది. 89 స్థానాల్లో ఆప్, 15 స్థానాల్లో కాంగ్రెస్, శిరోమనీ అకాలీదళ్ 8 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేజ్రీవాల్ తరహా పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు ఆ పార్టీ నేత రాఘవ్ చడ్డా తెలిపారు. కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ ప్రత్యామ్నాయంగా మారినట్లు ఆయన చెప్పారు. నౌకరీల కోసం పంజాబీ యువత ఎంతో కాలం వేచి చూసిందన్నారు.