Lucknow, Feb 20: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (5 States Elections) ఆదివారం కీలకమైన పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మూడోదశ అసెంబ్లీ ఎన్నికలు, పంజాబ్(Punjab), ఉత్తరాఖండ్ (Uttarakhand)ల్లో ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే యూపీలో రెండు దశల పోలింగ్ పూర్తికాగా, మూడో దశ పోలింగ్ (Third Phase) ఉదయం ఏడు గంటలకు మొదలైంది. మూడో దశలో భాగంగా మొత్తం 16 జిల్లాలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 59 అసెంబ్లీ స్థానాలకు గానూ వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు మొత్తం 627 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడో విడత ఎన్నికల్లో 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొదటి రెండు దశల్లోనూ స్వల్ప ఘటనలు మినహా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు..మూడో దశను ప్రశాంతంగా ముగించేందుకు కృషి చేస్తున్నారు.
Kanpur votes in the third phase of Uttar Pradesh Assembly elections
59 assembly seats across 16 districts of the state are voting today pic.twitter.com/xc80pfTxzI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
యూపీ మూడో విడత ఎన్నికల్లో ముఖ్య నేతలు బరిలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) కర్హాల్ (Karhal) అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇదే స్థానంలో బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్ (SP Singh Bhagel) పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ పోలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కీలకమైన జశ్వంత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్ (Shivpal singh) పోటీలో ఉన్నారు. యూపీ ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా భావించే పలు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
అటు పంజాబ్ తో పాటు ఉత్తరాఖండ్ లోనూ ఆదివారం నాడు ఒకే విడతలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలలో 2 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు 1304 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. పంజాబ్ లో ప్రదానంగా కాంగ్రెస్, ఏఏపీ, బీజేపీ, శిరోమణి అకాలీదళ్-బీఎస్పీ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొనగా.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ (Amrinder singh) స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ కీ రోల్ పోషించే అవకాశం కనిపిస్తుంది.
#PunjabElections2022 | Mock polling underway at booth number 158 to 161 at Govt Girls Sr. Sec. School, Moga as voting on 117 Assembly seats to start at 8am pic.twitter.com/hjxNiarhY2
— ANI (@ANI) February 20, 2022
ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ చివరి క్షణాల వరకు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించగా.. దాదాపు ప్రధాన పార్టీలన్నీ పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపించాయి. ఢిల్లీలో ఏడాదికిపైగా సాగిన రైతు ఉద్యమం కారణంగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు జరిగింది. ఈ ఎఫెక్ట్ పంజాబ్ ఎన్నికలపై పడే అవకాశముంది.
కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాలు దేశంలో అధికార పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తే.. ప్రధాని నుండీ బడా నేతల వరకు పంజాబ్ లో దిగిపోయి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. మరి ఇక పంజాబ్ ఓటర్ల నిర్ణయం ఏంటన్నది చూడాలి. భారీ పోలీసు బందోబస్తు, కోవిడ్ ప్రోటోకాల్ నడుమ ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు.