Hyderabad, Feb 19: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR)...ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఒక్కొక్కరిని కలువనున్నారు. ఈ మేరకు ఆదివారం నాడు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేతో (Uddhav Thackeray) సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో (Uddhav Thackeray) ఆయన నివాసంలో భేటీకానున్నారు. ఇద్దరు సీఎంలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నది. భేటీ అనంతరం సీఎం కేసీఆర్ బృందం థాక్రే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని.. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad pawar) నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయ అంశాలపై ఆయనతోనూ చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.
కేంద్రంలోని బీజేపీపై (BJP) ఇప్పటికే విరుచుకుపడుతున్న కేసీఆర్...తనతో కలిసి వచ్చే నేతలతో టచ్ లో ఉంటున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇప్పటికే ఉద్ధవ్ ప్రకటించారు.
దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకునేందుకు సరైన సమయంలో గళం విప్పారన్న ఉద్దవ్ థాక్రే.. దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని, ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. వీరద్దరి భేటీలో జాతీయ రాజకీయాలు, దేశ వ్యాప్త పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రాల మధ్య సంబంధాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశముంది.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పాలనాపరమైన అంశాలపై కూడా ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ వెంట కొంత మంది టీఆర్‌ఎస్ నేతలు కూడా ముంబయి వెళ్లనున్నారు.