Rajinikanth's Political Entry: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్, వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తలైవా
File image of Rajinikanth (Photo Credits: ANI)

Chennai, December 3: సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వచ్చిన సందిగ్ధతకు నేడు తెరపడింది, ఎట్టకేలకు సూపర్ స్టార్ రజినీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై గురువారం కీలక ప్రకటన చేశారు. రోబోయే ఏడాదిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు రజినీకాంత్ స్పష్టం చేశారు, డిసెంబర్ 31న తన పార్టీని ప్రకటించి, జనవరిలోనే ప్రారంభిస్తానని ఆయన తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించారు.

69 ఏళ్ల రజనీకాంత్ తన ఫోరమ్ సీనియర్ ఆఫీసర్లు రజిని మక్కల్ మండ్రాంతో సమావేశమైన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన చేశారు.

రజనీకాంత్ మాట్లాడుతూ, “మేము ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధిస్తాము, నిజాయితీ, పారదర్శక, అవినీతి రహిత మరియు ఆధ్యాత్మిక రాజకీయాలను ఇస్తాము. ఒక అద్భుతం మరియు మార్పు ఖచ్చితంగా జరుగుతుంది.

మారుస్తాం, ఖచ్చితంగా అన్నీ మారుస్తాం, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు జరగదు" అంటూ రజినీకాంత్ పేర్కొన్నారు.

వయసు మీదపడటం, ఆపై కిడ్నీ మార్పిడి సమస్యలు ఉండటం మూలానా వైద్యుల సూచనల మేరకు ప్రస్తుత పరిస్థితులలో ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల‌లోకి రాడ‌ని, జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇందుకు సంబంధించి ఒక లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆయన అభిమాన సంఘాలకు ఆ లేఖ గందరగోళానికి గురిచేసింది. ఈ నేప‌థ్యంలో త‌లైవా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో తన పార్టీ రజనీ మక్కళ్‌ మండ్రం (ఆర్‌ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమై చర్చించారు. అనంతరం పోయెస్‌ గార్డెన్‌లోని తన నివాసం వెలుపల విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎంఎం కార్యదర్శులు తమ అభిప్రాయాలను వాళ్లు చెప్పారని, తన అభిప్రాయాన్ని తాను తెలియజేశానని రజినీ తెలిపారు. ‘నా నిర్ణయం ఏదైనా సరే నా వెంటే ఉంటానని వాళ్లు చెప్పారు. నా నిర్ణయాన్ని వీలైనంత త్వరగా వెల్లడిస్తాన’ని చెప్పారు. ఈ క్రమంలో నేడు ఊహాగానాలన్నింటినీ ఫుల్ స్టాప్ పెడుతూ, గతంలో లాగా దాటవేయకుండా తన రాకను ఖరారు చేస్తూ స్పష్టమైన ప్రకటన చేయడంతో రజినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Here's the tweet:

1990 నాటి నుంచే రజినీ రాజకీయ ప్రవేశంపై ప్రచారం జరుగుతూ ఉంది.  1996లో రజిని బహిరంగంగా డిఎంకెకు మద్దతు ఇచ్చారు. అంతేకాకుండా జయలలిత నుండి తమిళనాడును కాపాడాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికలలో ఎఐఎడిఎంకె ఓడిపోయినప్పుడు రజిని ఒక గేమ్ ఛేంజర్ గా చూడబడ్డారు. మళ్లీ జయలలిత మరణించిన నాటి నుంచి కూడా రజినీ ఎంట్రీపై జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం రజినీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించినప్పటికీ ఆయనకు వ్యక్తిగతంగా డిఎంకె పార్టీతో సత్సంబంధాలున్నాయి. రజినీకి స్టాలిన్ అన్నయ్య అయిన అలగిరితో మంచి సంబంధం ఉందని చెబుతారు.

ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ ఎలాంటి మార్పు తీసుకొస్తాడు, ఆయన సీఎం అవుతారా? లేక తన కొందరిలాగా ఆయన ప్రభావం అంతతమాత్రమే అనిపించుకుంటాడా అనేది రాబోవు కాలంలో తెలుస్తుంది.