Jaipur, August 11: గత కొంతకాలంగా రాజస్తాన్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి (Rajasthan Political Crisis) తెరపడింది. సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన సచిన్ పైలట్ వర్గం (Sachin Pilot Team) చివరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో (Congress Party) చర్చల అనంతరం సచిన్ పైలట్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను గుర్తించడంతోపాటు పరిష్కారానికి కృషి చేసిన సోనియా, రాహుల్, ప్రియాంకతోపాటు పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు.
రాజకీయాల్లో దుర్మార్గానికి లేదా వ్యక్తిగత శత్రుత్వానికి చోటు లేదని రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Rajasthan Political Leader Sachin) తెలిపారు. సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఎదురు తిరిగిన ఆయన చాలా రోజుల తర్వాత మీడియాతో మంగళవారం మాట్లాడారు. ప్రియాంకజీ, రాహుల్‌జీ తమ మనోవేదనను ఓపికగా విన్నారని సచిన్ పైలట్ చెప్పారు. వాటిని పరిష్కరించడానికి రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను, కొంతమంది ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని సచిన్ పైలట్ చెప్పారు. రాజస్థాన్ రాజకీయాల్లో కీలక మలుపు, సొంత గూటికి తిరిగిరానున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఆగస్టు 4 నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు
తాము లేవనెత్తిన సమస్యలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తనకు ఎలాంటి పదవి వద్దన్న సచిన్ పైలట్.. అవి వస్తుంటాయి, పోతుంటాయని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని, మనపై వారి నమ్మకాన్ని బలోపేతం చేసే దిశలో మనం పనిచేయాలని సచిన్ పైలట్ తెలిపారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన కుటుంబం నుంచి కొన్ని విలువలు నేర్చుకున్నానని, ఎవరిని ఎంత వ్యతిరేకించినా, నేనెప్పుడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పైలట్ అన్నారు. అశోక్ గెహ్లాట్ తన కన్నా పెద్దవారు అని, ఆయన్ను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, కానీ ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తానని తెలిపారు.
రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై అసమ్మతి స్వరం వినిపిస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌తోపాటు మరో 18మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోవైపు ఈనెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
అయితే సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పుడు ఇరకాటంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ క్షమిస్తే, తాను రెబల్స్‌కు స్వాగతం పలకనున్నట్లు సీఎం గెహ్లాట్ తెలిపారు. గతంలో పైలట్‌ను తిట్టిన గెహ్లాట్ ఇప్పుడు ఆయనతో ఎలా కలిసి పనిచేస్తారన్నదే ఆసక్తిగా మారింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు మళ్లీ గెహ్లాట్ ఆరోపించారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నట్లు గెహ్లాట్ చెప్పారు. బీజేపీ వేసిన వ్యూహాలు విఫలమైనట్లు తెలిపారు. డబ్బు, పదవులు ఇచ్చినా.. తమ ఎమ్మెల్యేలు ఎక్కడికీ వెళ్లలేదన్నారు. వారందరికీ తానే గార్డియన్‌గా ఉండనున్నట్లు చెప్పారు.