Kolkata, Jan 18: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Polls) సమీపిస్తున్నా కొద్ది భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రోజు రోజుకు వార్ వేడెక్కుతోంది. తాజాగా రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీపై కొందరు రాళ్లు (Stones pelted at BJP workers) రువ్వారు. ఈ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్, సువేందు అధికారి (state chief Dilip Ghosh and Suvendu Adhikari) పాల్గొన్నారు.
రోడ్డుకు ఒకవైపు బీజేపీ ర్యాలీ కొనసాగుతుండగా.. మరోవైపు రోడ్డుకు అవతల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ర్యాలీలో ఉన్న కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వడం ప్రారంభించారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై ఉన్న డివైడర్ చాటున దాక్కున్నారు. అయితే రాళ్లు రువ్విన వ్యక్తుల చేతిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు కనిపించడం విశేషం.
ఇదిలా ఉంటే బీజేపీపై సీఎం మమతా బెనర్జీ ( mamata banerjee) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీని ‘వాషింగ్ మెషిన్’ తో పోల్చారు. నందిగ్రామ్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘బీజేపీ ఓ వాషింగ్ మెషిన్. నలుపుతో అందులోకి వెళితే.. తెలుపై బయటికి వస్తారు. వాషింగ్ పౌడర్ బీజేపీ... వాషింగ్ పౌడర్ బీజేపీ...’’ అంటూ మమతా బెనర్జీ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార తృణమూల్‌ను కాదని సుబేందు అధికారితో పాటు మరికొందరు బీజేపీలో చేరిపోయారు. వీటిని దృష్టిలో పెట్టుకునే మమతా బెనర్జీ ఈ వ్యా్ఖ్యలు చేశారు.
Here's Stones pelted at BJP workers Video
#WATCH | West Bengal: Stones were pelted at BJP workers who were part of a rally attended by Union Minister Debasree Chaudhuri, state BJP chief Dilip Ghosh and Suvendu Adhikari in Kolkata earlier today. pic.twitter.com/hLW8NEmWeX
— ANI (@ANI) January 18, 2021
కాగా అసోం, తమిళనాడు, కేరళతో కలిసి ఏప్రిల్-మే నెలల్లో 294 సీట్ల పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు (West bengal assembly polls) జరిగే అవకాశం ఉంది. గత రెండు నెలలుగా మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం మునుపెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టీఎంసీ (All India Trinamool Congress) ప్రముఖ నేతగా పేరున్న సువేందు అధికారి ఇటీవల పలువురు పార్టీ కార్యకర్తలతో కలిసి బీజేపీలో చేరారు.
2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 211 సీట్లు గెలుచుకుని మెజారిటీ నిలుపుకొంది. బీజేపీ 3 సీట్లు సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 18 సీట్లు సాధించి గట్టి ప్రత్యర్థిగా నిలిచింది. కాంగ్రెస్ 2 సీట్లలో గెలుపొందింది. రాష్ట్రాన్ని 34 ఏళ్ల పాటు పాలించిన వామపక్షాలు ఖాతా తెరవలేదు.
పశ్చిమ బెంగాల్ కి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమాలకు ఊపిరిలూదిన నందిగ్రామ్ నుంచి పోటీకి దిగాలని దీదీ నిర్ణయించుకున్నారు. సోమవారం నందిగ్రామ్‌లో జరిగిన ఓ బహిరంగ సభ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. వీలైతే భవానీ పూర్ నుంచి కూడా బరిలోకి దిగుతానని ఆమె ప్రకటించారు. ప్రస్తుతం ఆమె జాదవ్‌పూర్ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ప్రస్తుతం నందిగ్రామ్ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సుబేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుబేందు అధికారిని బీజేపీ తన వైపు తిప్పుకొని సీఎం మమతా బెనర్జీని రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఈ నేపథ్యంలో తిరిగి అక్కడ తృణమూల్ ఆధిపత్యాన్ని నిలపాలన్న దృఢ నిశ్చయంతోనే సీఎం మమత ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి కూడా తృణమూల్‌కు 200 సీట్లు వస్తాయని, తిరిగి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
నందిగ్రామ్ గడ్డపై ఎవరు ఉద్యమం చేశారో... ఒక్కాసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆమె ప్రజానీకాన్ని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, కేంద్రం ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ అందరికీ డబ్బుల ఆశ చూపుతోందని, అందుకే అందరూ బీజేపీలో చేరిపోతున్నారని పరోక్షంగా సుబేందుపై మమత విరుచుకుపడ్డారు.
కాగా సుబేందుకు నందిగ్రామ్ తో పాటుగా మరో 55 నియోజకర్గాలపై అపూర్వమైన పట్టుంది. ఆయన పూర్తి కనుసన్నలతోనే ఆ నియోజకవర్గాల రాజకీయాలను శాసిస్తారన్న పేరు గడించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన మమతాతో విభేదించి, బీజేపీలో చేరిపోయారు. దీంతో నందిగ్రామ్‌తో పాటు సుబేందు అధికారికి పట్టున్న ప్రాంతాల్లో బీజేపీ సునాయాసంగా గెలిచే అవకాశాలున్నాయి. దీన్ని పసిగట్టిన సీఎం మమత.... నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఇలా చేయడం ద్వారా సుబేందు కేవలం నందిగ్రామ్ రాజకీయాలపైనే దృష్టి సారిస్తారని, మిగితా 50 నియోజకవర్గాల వ్యవహారాలపై పూర్తిగా దృష్టి నిలపలేరని, ఇలా చేయడం ద్వారా రాజకీయంగా ఆయన్ను నిలువరించిన వారమౌతామన్న వ్యూహంతో మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.