Guntur, September 11: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ "అరాచక పాలన" కొనసాగిస్తున్నారంటూ అధికార వైసీపీ పార్టీ చేత దాడులకు గురికాబడ్డ బాధితులకు సంఘీభావంగా మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) "చలో ఆత్మకూరు" (Chalo Atmakur) కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరోవైపు, చంద్రబాబువి అన్నీ దొంగ నాటకాలే, ఆ బాధితులందరూ టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ అధికార వైసీపీ కూడా వారికి పోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమం చేపట్టంది. రాష్ట్రంలో 'అరాచకాలు జరుగుతున్నాయి' అనే ఏకైకా ఎజెండాతో అధికార, ప్రతిపక్ష పార్టీలు (YSRCP and TDP) ఇలా పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏపీలో ఒక్కసారిగా రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అప్రమత్తమై గుంటూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. పల్నాడు ప్రాంతంలో పోలీస్ సెక్షన్ 30 అమలు చేశారు.
చంద్రబాబును ఆత్మకూరు వెళ్లనీయకుండా పోలీసులు ఆయనను ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు చంద్రబాబు కుమారుడైన లోకేశ్ సహా ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన రావు, శిద్ధా రాఘవ రావు మరియు అశోక్ రెడ్డి తదితరులను ఎక్కడికక్కడ వారిని ఇంట్లో నుంచి బయటకు రానీయకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. మరికొంత మంది టీడీపీ నాయకులను కూడా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా వారి నుండి సంతకాలు తీసుకుని బైండోవర్ చేసి పంపారు. అలాగే కృష్ణా జిల్లా నుంచి చలో ఆత్మకూరు కార్యక్రమానికి తరలివెళ్తున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి నూజివీడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ గుంపులుగుంపులుగా జనాలు కనిపించకుండా పోలీసులు పలడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి దినం.
తాము శాంతియుతంగా నిరసనల కార్యక్రమాలు చేపడితే ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. ఆయనను హౌజ్ అరెస్ట్ చేయడంతో ఆయన తన ఇంట్లోనే నిరాహార దీక్షకు పూనుకున్నారు. సొంత ఊళ్లో నివసించి హక్కు కోసం తాము పోరాడుతున్నామని, ప్రశ్నించే గొంతును నొక్కడం ఏంటి? ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి దినం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
న్యాయం కోసం పోరాడితే జగన్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నిరంకుశ పాలనలో ఉన్నామా? అని చంద్రబాబు నిలదీశారు. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.
తనను హౌజ్ అరెస్ట్ ఎలా చేస్తారు? ఖచ్చితంగా చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొంటాను, ఎలా అడ్డుకుంటారో చూస్తానని పోలీసులకు ఆయన హెచ్చరిక పంపారు.
వైసీపీ ఘాటైన స్పందన.
ఏపీలో తాజా రాజకీయ పరిణామాల పట్ల వైసీపీ రాజ్యసభ సభ్యుడు ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఇదంతా చంద్రబాబు దొంగలముఠా కుట్రగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు హయాంలో గత ఐదేళ్లు రౌడీ రాజ్యం నడిచిందని ఆయన తేల్చిచెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన సెటైర్లు వేశారు.
యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా @ncbn దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీ రాజ్యమేలింది. ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోంది. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 11, 2019
ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలతో ప్రస్తుతం ఒక కృత్రిమమైన ఉద్రిక్త పరిస్థిలు నెలకొన్నాయి. గుంటూర్ జిల్లా వ్యాప్తంగా అరెస్టులు, బైండోవర్లు. అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య ఆరోపణ- ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది ఇంకా ఎక్కడివరకు దారితీస్తుందో చూడాలి.