G. Kishan Reddy takes charge as cabinet minister | Photo: ANI

New Delhi, July 8: కేంద్రమంత్రిగా తెలంగాణ సీనియర్ బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రం నుంచి తొలి కేంద్ర కేబినేట్ మంత్రి హోదా దక్కించుకున్న తొలి నేత కిషన్ రెడ్డి కావడం విశేషం. 2019లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత కేవలం 25 నెలల్లోనే ప్రధానమంత్రి మంత్రివర్గంలో కేబినేట్ మంత్రిగా కిషన్ రెడ్డికి పదోన్నతి లభించింది. కిషన్ రెడ్డికి సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు కేటాయించారు. ఆయన ఈ మూడు శాఖలు బాధ్యతలను బుధవారం దిల్లీలో స్వీకరించారు.

రంగారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్ అనే గ్రామంలో సాధారణ రైతుకుటుంబంలో జన్మించిన గంగారపు కిషన్ రెడ్డి 1980ల్లో బీజేపీలో ఓ సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీలో ఒక్కొక్కమెట్టు ఎదుగుతూ 2002లో భారతీయ జనతా యువ మోర్చా (బిజెపి యువజన విభాగం) అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

2004లో హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు, ఆ తర్వాత 2009 మరియు 2014లో వరుసగా రెండు పర్యాయాలు అంబర్ పేట అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు.

ఆ తర్వాత టర్ములో 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోగా, మరుసటి ఏడాదే 2019లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. ఆ వెంటనే కేంద్ర సహాయమంత్రి నేడు కేబినేట్ మంత్రిగా ఎదిగారు.

ఇక తనను కేబినేట్ మంత్రిగా గౌరవించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..

"ప్రధానమంత్రి అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్లేందుకు శక్తివంచనలేకుండా ప్రయత్నిస్తాను, నాకు మార్గదర్శనం చేసి మద్దతుగా నిలిచిన అమిత్ షాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, నవభారత నిర్మాణం కోసం కృషి చేయడం మరియు తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా తెలంగాణ అభివృద్ధి కోసం చురుగ్గా పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతానికి నా ముందున్నాయి, నన్ను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

నేడు కేంద్ర కేబినేట్ భేటీ

ఇదిలా ఉంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా ఈ భేటీ జరగనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. కేబినెట్‌ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చించడంతో పాటు నూతనంగా మంత్రి పదవులు అందుకున్నవారితో ప్రధాని ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం.