Arvind Kejriwal & Prakash Javadekar | File Photo

New Delhi, February 03: దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadeka) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఒక ఉగ్రవాది (Terrorist) అంటూ, అందుకు అనేకమైన ఆధారాలు కూడా ఉన్నాయని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. పంజాబ్ ఎన్నికల సమయంలో ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ గురీందర్ సింగ్ నివాసంలో కేజ్రీవాల్ ఉన్నారు. అదో ఉగ్రవాది ఇల్లు అని ఆయనకూ తెలుసు, ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? అని జవదేకర్ ప్రశ్నించారు. 'అరవింద్ కేజ్రీవాల్ అమాయకమైన ముఖం పెట్టి నేనేమైనా ఉగ్రవాదినా? అని అడుగుతారు. అవును, నువ్వు ఉగ్రవాదివే, అందుకు అనేకమైన ఆధారాలున్నాయి. గతంలో తానో అరాచకవాదినంటూ కేజ్రీవాల్ తనకు తానే చెప్పుకున్నారు. అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్దగా తేడా ఏం ఉండదు అని' జవదేకర్ అన్నారు. జేఎన్ యూలో దేశంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై విచారణ జరగకుండా కేజ్రీవాల్ అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. షాహిన్ బాగ్, జేఎన్ యూలోని అరాచకశక్తులకు మద్ధతిస్తున్న కేజ్రీవాల్ నిజంగా టెర్రరిస్టే అని జవదేకర్ నొక్కి చెప్పారు.

Prakash Javadekar's Statement:

దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో బీజేపీ నేతలు అర్వింద్ కేజ్రీవాల్ ను లక్ష్యంగా చేసుకొని ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

వారం క్రితం బీజేపి ఎంపి పర్వేశ్ వర్మ మొదటగా 'టెర్రరిస్ట్' అనే పదాన్ని కేజ్రీవాల్ పై వాడారు. కేజ్రీవాల్ తిరిగి అధికారంలోకి వస్తే, "షాహీన్ బాగ్-రకం" ప్రజలు దీల్లీ వీధులను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అయినా కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులు ఉంటే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు. మనం కాశ్మీర్లో పాకిస్థాన్ ఉగ్రవాదులతో పోరాడాలా? లేక దేశంలో దాగిఉన్న కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులతో పోరాడాలా? అంటూ ఎంపీ పర్వేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై అర్వింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేయగా, ఎన్నికల కమిషన్ ఆ ఎంపీ ప్రచారంపై నిషేధం విధించింది. తాజాగా అదే తరహా వ్యాఖ్యలను జయదేకర్ చేశారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 11న వెల్లడవుతాయి. ఈసారి దిల్లీ పీఠంపై ఏ పార్టీ జెండా ఎగరేస్తుందో చూడాలి.