Huzur Nagar, October 24: తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి (Huzur Nagar Constituency) జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ (TRS Party) అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ((Sanampudi Saidireddy), తన సమీప అభ్యర్థి పద్మారెడ్డి (కాంగ్రెస్) పై 43, 624 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన ఈ ఎన్నికలో ప్రధాన పోటీ అధికార TRS మరియు ప్రతిపక్ష Congress పార్టీల మధ్యే ఉంటుందని అంతా భావించారు. ఇరు పార్టీల మధ్య పోరు హోరా-హోరీగా నిలుస్తుందని అందరూ అనుకున్నా, హుజూర్ నగర్ ప్రజలు మాత్రం పూర్తి ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు. ఇక బీజేపీ, టీడీపీ పార్టీల డిపాజిట్ గల్లంతయింది.
ఈ విజయం టీఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకం. ఒకవైపు ఆర్టీసీ సమ్మె, మరోవైపు ఏకమైన ప్రతిపక్షాలు. అంతా కలిసి ప్రభుత్వంపై మూకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఈ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రత్రిష్ఠాత్మకంగా తీసుకుంది. చివరకు ఈ ఎన్నికలో అన్నింటినీ తట్టుకొని టీఆర్ఎస్ అభ్యర్థి ఘనవిజయం సాధించడం, అంతకుమించి భారీ మెజారిటీ రావడంతో అధికార పార్టీకి ఇదోక గ్రేట్ రిలీఫ్‌గా చెప్పవచ్చు. హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ విజయం నేపథ్యంలో ఈ సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఆర్టీసీ సమస్యపై సీఎం ఏమైనా స్పందిస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత స్థానాన్ని కోల్పోవడం, సొంత నియోజకవర్గంలోనే ఆయన సతీమణి పద్మారెడ్డి భారీ ఓటమి చెందడం కాంగ్రెస్ శ్రేణులకు ఇది మింగుడు పడటం లేదు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి భారీ షాక్ అని చెప్పవచ్చు. డిసెంబర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ గెలవడంతో ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పద్మా రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి,పోటీలో నిలిపినా, గెలిపించుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
మరోవైపు గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మరోసారి పోటీ చేసే అదృష్టం ఈ ఉపఎన్నిక రూపంలో వరించింది, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వంపై భారీగా విమర్శలు వచ్చినా, సైదిరెడ్డి ఘనవిజయం సాధించడం ఆయనను, టీఆర్ఎస్ పార్టీని సంబరాల్లో ముంచేశాయి.
అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ జరిగింది, 302 పోలింగ్ కేంద్రాల్లో 2,36,842 మంది ఓటర్లకుగాను 2,00,754 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 84.76 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు అక్టోబర్ 24, గురువారం ఈ ఉపఎన్నికకు కౌంటింగ్ నిర్వహించారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతీ రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది.