New Delhi, February 04: పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉభయ సభల్లో విపక్షాలు ఇచ్చే వాయిదా తీర్మానాలపై చర్చ జరుగుతుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) మరియు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కు సంబంధించిన అంశాలు, దిల్లీ జేఎయూలో కాల్పులు తదితర అంశాలపై విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై సభలో చర్చ జరిగింది.
ఇదే క్రమంలో, కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత హెగ్డే ఇటీవల జాతిపిత మహాత్మా గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల రాజ్యసభలో దుమారం రేగింది. హెగ్డే వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు లోకసభలో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అనంత హెగ్డే క్షమాపణ చెప్పాలంటూ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభ వాయిదా పడింది.
కర్ణాటకలో ఇటీవల ఎంపీ అనంత హెగ్డే మాట్లాడుతూ గాంధీజీ చేపట్టిన స్వాతంత్య్రోద్యమం అంతా బ్రిటీష్ పాలకులతో ఒక ఒప్పందం ప్రకారం జరిగిన 'సర్దుబాటు' అని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల్లో రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు 'శస్త్ర' అంటే ఆయుధాలతో బ్రిటీష్ పాలకులపై యుద్ధం చేశారు, ఇంకొకరు 'శాస్త్ర' - అంటే తమ ఆలోచనలతో, వ్యూహాలతో బ్రిటీష్ పాలకుల నడ్డివిరిచినవారు. వీరు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణ త్యాగాలను కూడా చేశారు. కానీ ఈ స్వాతంత్య్రోద్యమ పోరాటంలోనే ఎలాంటి త్యాగాలు చేయకుండా కొంత మంది 'మహా పురుషులు' సత్యాగ్రహం, ఉపావాసం అనే డ్రామాలతో ఎలా ఉద్యమం చేయాలి? అని బ్రిటీష్ వారినే అడుగుతూ, వారు చెప్పినట్లుగానే స్వాతంత్య్రం కోసం పోరాడారు. కానీ దేశం కోసం త్యాగాలు చేసిన వారు వెలుగులోకి రాలేదు కానీ, బ్రిటీష్ వారితో సర్దుబాటు ఉద్యమాలు చేసిన వారు మాత్రం నేడు స్వాతంత్య్ర సమరయోధులుగా కీర్తించబడుతున్నారు. ఇది మన దేశపు దౌర్భాగ్యం అని హెగ్డే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం వెనకడుగు, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడి
హెగ్డే వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఆయన తరఫున ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాగా, అనంత హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ కూడా తీవ్రంగా పరిగణిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.