Uttar Pradesh Lok Sabha Elections Results 2024

భారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 2014లో 71 స్థానాలను, 2019లో 62 స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో మాత్రం బీజేపీ 74 స్థానాల్లో పోటీ చేసి 33 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.

సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీ పొత్తు ఇక్కడ బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టింది. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నది. అయోధ్య రామమందిర నిర్మాణం బీజేపీకి రాజకీయంగా లాభం చేకూర్చలేదు. ఆ పార్టీ గొప్పగా చెప్పుకున్న యోగి ఆదిత్యనాథ్‌ బుల్డోజర్‌ పాలసీ బెడిసికొట్టింది. రాష్ట్రం నుంచే పోటీ చేసినప్పటికీ మోదీ మ్యాజిక్‌ ఈసారి పని చేయలేదు. అప్నాదల్‌(సోనేవాల్‌), ఆర్‌ఎల్‌డీ, సుహల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ, నిషాద్‌ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని, సామాజిక సమీకరణాలను అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ చేసిన ప్రయత్నాలు కూడా అంతగా ఫలించలేదు.  కర్నాటక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇవిగో, 19 స్థానాల్లో ఎన్టీఏ కూటమి గెలుపు, 9 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్

కాంగ్రెస్‌, ఎస్పీలను గెలిపిస్తే ఆ పార్టీలు రామమందిరంపైకి బుల్డోజర్లను నడిపిస్తాయంటూ మే 17న సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. అయినా ఆ మాటలను.. రామమందిరం కొలువై ఉన్న ఫైజాబాద్‌ నియోజకవర్గ ప్రజలు విశ్వసించలేదు. ఆ బాల రాముడి ఆశీస్సులు సైతం బీజేపీకి దక్కలేదు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్‌పై.. సమాజ్‌వాదీ అభ్యర్థి అవధేశ్‌ ప్రసాద్‌ ఘన విజయం సాధించారు. అయోధ్యనుఅభివృద్ధి చేసే క్రమంలో భాగంగా రోడ్ల వెడల్పు కార్యక్రమంలో 4000 దుకాణాలను కూల్చివేయడం, చాలామందికి పునరావాస ప్యాకేజీలు ఇవ్వకపోవడం.. ఈ ఓటమికి కారణాలని సమాచారం. 543 ఎంపీ సీట్లలో 240 మాత్రమే గెలుచుకున్న బీజేపీ, 99 సీట్లతో పుంజుకున్న కాంగ్రెస్, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..

వారాణసీలో వెలువడ్డ తొలి రెండు రౌండ్ల ఫలితాలు మోదీ పరివారానికి ముచ్చెమటలు పట్టించాయి. ఆ రౌండ్లలో మోదీకి 9,500ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అజయ్‌రాయ్‌కి 14,503ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ మోదీ ముందంజలోకి రావడంతో వారంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 2019లో మోదీకి 4,79,505 మెజారిటీ రాగా, ఈసారి 1,52,513 మెజారిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ పార్టీల పొత్తు ఇండియా కూటమికి సత్ఫలితాలను ఇచ్చింది. 2014లో కేవలం 5 స్థానాలు, 2019లో 5 స్థానాలకే పరిమితమైన సమాజ్‌వాదీ పార్టీ ఈసారి 62 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 37 స్థానాలను కైవసం చేసుకుంది. 2019లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ ఈసారి ఆరు స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ ఓడిపోయిన అమేథీలో ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీలాల్‌.. స్మృతి ఇరానీని ఓడించారు.

యూపీ మొత్తం సీట్ల సంఖ్య 80 కాగా ఎన్డీయే కూటమికి 37 సీట్లు, ఇండియా కూటమకి 42 సీట్లు, ఇతరులు 1 సీటు గెలుచుకున్నాయి.