Kolkata, Sep 6: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల (West Bengal Assembly Bypolls) బరిలో దిగనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. బంగాల్ సీఎం మమతాబెనర్జి భవానీపూర్ (TMC candidate from Bhabanipur) నుంచి బరిలో దిగనున్నారు. మిగిలిన రెండు స్థానాలు షంషేర్ గంజ్ నుంచి అమీరుల్ ఇస్లాం, జాంగీర్‌పూర్ నుంచి జాకీర్ హుస్సేన్ పోటీ చేయనున్నారు. కాగా పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ఖాళీగా ఉన్న భవానీపూర్, షంషేర్‌గంజ్, జాంగీర్‌పూర్ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
పశ్చిమబెంగాల్‌లోని మూడు స్థానాలతోపాటు ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ స్థానానికి కూడా అదే రోజు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఎన్నికల్లో ఓట్లను అక్టోబర్ 3న లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపింది. పశ్చిమబెంగాల్లో భవానీపూర్ మినహా మిగిలిన రెండు స్థానాల్లో ఎన్నికల సందర్భంగా మరణించడంతో ఖాళీగా ఉన్నాయి. భవానీపూర్‌లో మాత్రం వ్యవసాయ మంత్రి సోబన్‌దేవ్ చటోపాధ్యాయ్ మమత బెనర్జి కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జి (CM Mamata Banerjee) బీజేపీ నేత సువెందు అధికారిని ఓడించడం కోసం అతని సొంత నియోజకవర్గంలో అతనిపై పోటీకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా రాష్ట్రంలో ఆమె పార్టీ ఘనం విజయం సాధించడంతో మమత ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో గెలిచిన చటోపాధ్యాయ్‌తో రాజీనామా చేయించిన మమత ఉపఎన్నికకు సిద్ధమయ్యారు.